
సినిమాల్లో గెస్ట్ రోల్ లో కనిపించిన వారు పోస్టర్ పై ప్రముఖంగా వేస్తారా. కానీ రామోజీరావుగారి క్రేజ్ అలాంటిది. ఆయన నటించింది చిన్న పాత్రలో అదీ ఒకే ఒక్క సినిమానే. కానీ ఈ రోజు ఆ సినిమా గురించి అందరూ మాట్లాడుతున్నారు. సినిమా పెద్దగా ఆడకపోయినా ఇన్నాళ్లూ గుర్తుండిపోయిందంటే రామోజీరావు, నందమూరి తారకరామారావు ఇద్దరూ ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించటమే. ఈ సినిమాలో అతిథి పాత్రలో నందమూరి తారక రామారావు నటించాడు. 1978 వినోదపు పన్ను రద్దు చెయ్యబడ్డ ప్రయోగాత్మక సినిమా ఇది. ఈ చిత్రం తోనే గాయని శైలజ తొలిసారిగా పరిచేయము అయ్యింది. ఆ సినిమా పేరే మార్పు.
ఉషా కిరణ్ మూవీస్ పేరుతో సినిమాలను నిర్మించారు రామోజీరావు. అయితే ఆయన ఓ సినిమాలో కనిపించారనే విషయం తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. . స్వతహాగా కళాభిమాని అయిన రామోజీరావు చిన్నతనంలో నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు. అలాగే ఒక సినిమాలోనూ అతిథిగా నటించారు. యు. విశ్వేశ్వరరావు 1978లో నిర్మించిన ‘మార్పు’ సినిమాలో ఆయన న్యాయమూర్తి పాత్ర పోషించారు. యు.విశ్వేశ్వరరావు స్యీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో రామోజీరావుది చిన్న పాత్రే. అయినా పత్రికాధిపతిగా ఆయనకి ఉన్న ఇమేజ్ వల్ల సినిమా పోస్టర్స్‌లో ఆయన ఫొటోను కూడా ప్రముఖంగా వాడారు. అప్పటికే రామోజీరావుకి ఆ రేంజి క్రేజ్ ఉండేది.
ఇక జంధ్యాల దర్శకత్వంలో రూపొందిన ‘శ్రీవారికి ప్రేమలేఖ’ చిత్రంతో మొదలైన రామోజీరావు సినీ ప్రయాణంలో ఎన్నో అద్భుత చిత్రాలు రూపుదిద్దుకున్నాయి. ప్రమాదంలో కాలు పోగొట్టుకుని, కృత్రిమ పాదంతో నాట్యంలో రాణించిన సుధాచంద్రన్ జీవిత కథనే ‘మయూరి’ చిత్రంగా మలిచారు. ఇందులో సుధాచంద్రనే నటించడం గమనార్హం.
అలాగే రౌడీయిజం, గుండాయిజంపై తిరగబడిన ఓ యువతి స్ఫూర్తివంతమైన కథతో ‘ప్రతిఘటన’ చిత్రాన్నీ, ఒడిశాలో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా ‘మౌన పోరాటం’ చిత్రాన్ని, పరుగుల రాణి అశ్వనీ నాచప్పను నటిగా పరిచయం చేస్తూ ‘అశ్వని’ చిత్రాన్ని నిర్మించి తన ప్రత్యేకత చాటుకున్నారు రామోజీరావు. వీటితో పాటు ‘నువ్వే కావాలి’, ‘నచ్చావులే’, ‘నువ్విలా’ వంటి యూత్‌ఫుల్ సినిమాలనూ రూపొందించి అన్ని రకాల ప్రేక్షకులను మెప్పించారు రామోజీరావు.
ఇక స్వర్గీయ నందమూరి తారకరామారావు మనవడు జూనియర్ ఎన్టీఆర్‌ను ‘నిన్ను చూడాలని’ చిత్రంతో హీరోగా 2001లో పరిచయం చేశారు రామోజీరావు. అలాగే నందమూరి కల్యాణ్‌రామ్‌ను కూడా 2003లో ‘తొలి చూపులోనే’ చిత్రంతో హీరోగా పరిచయం చేశారు రామోజీరావు. నందమూరి హరికృష్ణ తనయులైన వీరిద్దరూ ఇప్పుడు చిత్ర పరిశ్రమలో అగ్రస్థానంలో ఉన్నారు. అలాగే దర్శకుడు రాఘవేంద్రరావు తనయుడు ప్రకాశ్‌ను కూడా ‘నీతో’ సినిమాతో హీరోగా పరిచయం చేశారు. శ్రీకాంత్, తరుణ్, వినోద్‌కుమార్ కూడా ఉషాకిరణ్ మూవీస్ చిత్రాల ద్వారానే హీరోలుగా పరిచయమయ్యారు.