
కమెడియన్ సత్య నటించిన ‘వివాహ భోజనంబు’ సినిమా లాక్ డౌన్ కాన్సెప్ట్ తో తెరకెక్కించారు. ఈ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలానే మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘మంచి రోజులొచ్చాయి’, ‘WWW’ లాంటి సినిమాలు కూడా లాక్ డౌన్ కథలతోనే తెరకెక్కుతున్నాయి. ఇప్పుడు మరో సినిమా కూడా లాక్ డౌన్ కాన్సెప్టు తో చేస్తున్నారు. రీసెంట్ గా పాగల్ చిత్రంతో పలకరించిన హీరో విశ్వక్ సేన్ కూడా లాక్ డౌన్ కథతో సినిమా చేస్తున్నాడని సమాచారం.
వివరాల్లోకి వెళితే..విష్వక్‌సేన్ హీరోగా ఎస్.వి.సి.సి.డిజిటల్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘అశోకవనంలో అర్జునకళ్యాణం’. విద్యాసాగర్ చింత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బాపినీడు.బి., సుధీర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరో ఫ్యామిలీ ఓ అమ్మాయిని పెళ్లిచూపులు చూడడానికి వెళ్తుంది. అదే రోజున సడెన్ గా లాక్ డౌన్ అనౌన్స్ చేస్తారు. దీంతో అబ్బాయి ఫ్యామిలీ మొత్తం అమ్మాయి ఇంట్లోనే ఉండిపోతుంది. ఆ తరువాత ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయనే అంశాలతో సినిమాను తెరకెక్కిస్తున్నారు.
అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కథ మొత్తం ఒకే ఇంట్లో జరుగుతుందట. దీనికోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ సెట్ ను కూడా నిర్మించారు. షూటింగ్ మొత్తం ఒకే ఇంట్లో జరుగుతున్నా.. ప్రేక్షకులకు ఆ ఫీలింగ్ రాకుండా ఉండేలా జాగ్రత్త పడుతున్నారని చెప్తన్నారు
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘‘ఈ సినిమా పేరు ఎంత భిన్నంగా ఉందో, సినిమా అదే తరహాలో ఉంటుంది. ఇప్పటివరకు విష్వక్‌సేన్ చేసిన చిత్రాలకి భిన్నంగా ఉంటుంది. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమాలో హీరోయిన్ సహా ఇతర నటీనటులు, సాంకేతిక బృందం ఎవరనే విషయాల్ని త్వరలోనే తెలియజేస్తాం’’ అన్నారు. దీనికి రచన: రవికిరణ్, సమర్పణ: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్.
ఇక గతంలో ‘ఫలక్ నుమా దాస్, హిట్’ చిత్రాలతో హిట్లు తన ఖాతాలో వేసుకున్న విశ్వక్ రీసెంట్ గా ‘పాగల్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నరేష్ కుప్పిలి దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం వర్కవుట్ కాలేదు.దిల్ రాజు సమర్పించిన ఈ చిత్రాన్ని లక్కీ మీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాల్ నిర్మించారు.