
తమిళ నటుడు విశాల్ రాజకీయాల్లో సత్తా చూపడానికి సిద్ధమవుతున్నాడని తెలుస్తోంది. తన అభిమాన సంఘాలను 'మక్కల్ నల ఇయక్కం'గా మార్చుతున్నట్లు తన పుట్టినరోజు నాడు వెల్లడించిన విశాల్.. ఇప్పుడు దాన్నే రాజకీయ పార్టీగా మార్చే ఆలోచన చేస్తున్నాడు.
నడిగర్ సంఘం ప్రెసిడెంట్ గా, తమిళ సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా వ్యవహరిస్తోన్న విశాల్.. సామాజిక సేవలో కూడా చేస్తుంటాడు. తన తల్లి పేరుతో స్థాపించిన ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా బీద వర్గాలకు సహాయం చేస్తూ.. ప్రజల సమస్యలపై పోరాడుతున్నాడు. గతేడాది డిసంబర్ లోనే ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నాడు విశాల్.
దానికి తగ్గ ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు. కానీ ఆయన నామినేషన్ పత్రాన్ని అధికారులు రిజక్ట్ చేయడంతో ఆ ఎన్నికల్లో పోటీ చేయలేకపోయారు. తాజాగా ఆయన క్రియాశీల రాజకీయాల్లో పాల్గోనబోతున్నట్లు మీడియా ముఖంగా వెల్లడించాడు.
''గ్రామాల్లో ప్రతి ఇంట్లో సిరులు కురవాలని, భావితరం భవిత బాగుండాలని కోరుకునే ప్రతి ఒక్కరూ నాకు మద్దతు పలకాలి. నేను స్థాపించిన మక్కల్ నల ఇయక్కంని పార్టీగా మార్చబోతున్నాను. క్రియాశీల రాజకీయాల్లో పాల్గొనడంతో పాటు.. తిరుప్పరంకుండ్రం శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు'' సూచన ప్రాయంగా వెల్లడించారు.