
చియాన్ విక్రమ్.. ప్రయోగాలకు కేరాఫ్. కమల్ హాసన్ తర్వాత ప్రయోగాలు చేయడంలో విక్రమ్ ముందుంటారు. `అపరిచితుడు`, `ఐ` లాంటి చిత్రాల్లో ఆయన ఎంతగా మారిపోయారో తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఆయన ఊరమాస్ లుక్‌లో, ఓ సాధువు తరహా పాత్రలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఆయన `తంగలాన్` అనే చిత్రంలో నటిస్తున్నారు విక్రమ్. పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. నేడు(ఏప్రిల్ 17) విక్రమ్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి కొత్త లుక్‌ని విడుదల చేశారు. దీంతోపాటు మేకింగ్ వీడియోని షేర్ చేశారు.
ఇందులో డీ గ్లామర్‌లో, ఊరమాస్‌గా, ఓ ఆటవిక మనిషిలా విక్రమ్ కనిపిస్తుండటం విశేషం. మాసిన గెడ్డం, సగం ఊడిన జుట్టు, సగం బట్టతల, నెరసిన జుట్టతో ఒంటిపై బట్టలు లేకుండా కనిపిస్తున్నారు. ఆయన లుక్ భయంకరంగా ఉంది. మేకింగ్ వీడియోలో విక్రమ్ యాక్టింగ్ అదరగొట్టేలా ఉంది. ఆయన లుక్ కోసం టీమ్ ఎంత కష్టపడ్డారో, మేకప్ కోసం ఆయన ఎంతగా శ్రమించారో అర్థమవుతుంది. మేకింగ్ పరంగానూ యూనిట్ పడ్డ కష్టం కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ మేకింగ్ వీడియో అభిమానులను అలరిస్తుంది. విక్రమ్ ఫ్యాన్స్ కి పర్‌ఫెక్ట్ ట్రీట్ లాగా ఉందంటున్నారు.
`శక్తి, పోరాటం, ప్రతీకారం, విముక్తి అనేవి తంగలాన్ ప్రపంచంలోని గనుల కంటే లోతుగా ఉన్నాయి` అని పేర్కొంది యూవీ క్రియేషన్స్. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్, నీలం ప్రొడక్షన్స్ పతాకాలపై తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు.ఈ సినిమాని త్వరలోనే విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
`కోలార్ గోల్డ్ ఫీల్డ్(కేజీఎఫ్) నేపథ్యంలో కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా.. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రంజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ కోసం విక్రమ్ ఇంతకు ముందెప్పుడూ కనిపించని గెటప్ లో కనిపిస్తున్నాడు. ఈ వీడియో గ్లింప్స్ చూస్తోంటే మూవీ కోసం మొత్తం ఎంతో కష్టపడుతున్నట్టుగా ఉంది. ఈ తరహా చిత్రాల్లో విక్రమ్ ఎప్పుడూ ది బెస్ట్ ఇస్తాడు. అది మరోసారి తంగలాన్ తో కనిపించబోతోందనిపిస్తోంది. పాన్ ఇండియన్ సినిమాగా బహుభాషల్లో విడుదల కాబోతోన్న `తంగలాన్` లో విక్రమ్ తో పాటు ఫీమేల్ లీడ్స్ లో పార్వతి, మాళవిక మోహనన్ నటిస్తుండగా.. ఓ కీలక పాత్ర కోసం హాలీవుడ్ నటుడు డేనియల్ కాల్లాగిరోన్ ను తీసుకున్నారు. ఇతర పాత్రల్లో పశుపతి, హరికృష్ణన్, అన్బుదురై, ప్రీతికరణ్, ముత్తుకుమార్ నటిస్తున్నారని` టీమ్ తెలిపింది.
సినిమాటోగ్రఫీ : ఎ.కిషోర్
సంగీతం : జి.వి.ప్రకాష్ కుమార్ రచయిత : తమిళ్ ప్రభ
ఆర్ట్ డిపార్ట్‌మెంట్ : ఎస్.ఎస్.మూర్తి
స్టంట్స్ : ఆర్.కె. సెల్వ, స్టన్నర్ సామ్
పి.ఆర్.వో : జి.ఎస్. కె మీడియా
నిర్మాణ సంస్థలు : స్టూడియో గ్రీన్ - కె.ఇ. జ్ఞానవేల్ రాజా, పా.రంజిత్ యొక్క నీలం ప్రొడక్షన్స్, యూవీ క్రియేషన్స్,
దర్శకత్వం : పా. రంజిత్