ఈడీ ముందుకు విజయ్‌ దేవరకొండ.. `లైగర్‌` పెట్టుబడులపై విచారణ..

By Aithagoni RajuFirst Published Nov 30, 2022, 12:32 PM IST
Highlights

విజయ్‌ దేవరకొండ ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. `లైగర్‌` సినిమా పెట్టుబడులకు సంబంధించిన ఈడీ బుధవారం విజయ్‌ దేవరకొండని విచారిస్తుంది. 

రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ(Vijay Deverakonda) ఈడీ(ఎన్‌ఫోర్స్ మెంట్‌ డైరెక్టరేట్‌)(ED) ముందుకు హాజరయ్యారు. ఆయన బుధవారం ఈడీ అధికారుల విచారణలో పాల్గొనబోతున్నారు. `లైగర్‌`(Liger) చిత్రంలో పెట్టుబడులకు సంబంధించి విజయ్‌ దేవరకొండని ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. కాసేపటి క్రితమే విజయ్‌ ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. ఈ రోజు ఆయన ఈడీ విచారణ ఎదుర్కొనబోతున్నారు. 

`లైగర్‌` సినిమా పెట్టుబడులు, ఆయన రెమ్యూనరేషన్‌, సినిమాకి ఎవరెవరు పెట్టుబడి పెట్టారనే దానిపై విచారించేందుకు ఈడీ అధికారులు విజయ్‌కి నోటీసులు జారి చేయగా, బుధవారం ఆయన విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఈ కేసులో దర్శకుడు పూరీ జగన్నాథ్‌, నిర్మాతగా వ్యవహరించిన ఛార్మి ఈడీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఇప్పుడు విజయ్‌ దేవరకొండని సైతం విచారించడం హాట్‌ టాపిక్‌ అవుతుంది. 

`లైగర్‌` చిత్రాన్ని పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కించారు. వంద కోట్లకుపైగానే బడ్జెట్‌ అయినట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే ఈ సినిమా ఆగస్ట్ 25న విడుదలై పరాజయం చెందింది. డిజాస్టర్‌గా నిలిచింది. ఆ నష్టాల వ్యవహారానికి సంబంధించిన లావాదేవీలను సైతం ఈడీ విచారిస్తుంది. ఇదిలా ఉంటే విదేశాల నుంచి ఈ సినిమాకి పెట్టుబడులు పెట్టినట్టు ఈడీ గుర్తించిందని సమాచారం. అంతేకాదు పలువురు పొలిటికల్‌ లీడర్స్ కూడా ఇందులో ఇన్వెస్ట్ చేశారట. దానిపై ఎన్‌ఫోర్స్ మెంట్‌ డైరెక్టరేట్‌ విచారించబోతుంది. 

విజయ్‌ దేవరకొండని ఈడీ ప్రశ్నించడమనే వార్త ఇప్పుడు అటు ఫిల్మ్ నగర్‌లో, ఇటు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అవుతుంది. మరి ఇందులో విజయ్‌ ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన `లైగర్‌`లో విజయ్‌ దేవరకొండ హీరోగా నటించగా, బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా చేసింది. వరల్డ్ మాజీ బాక్సింగ్‌ ఛాంపియన్‌ మైఖేల్‌ టైసన్‌ ఇందులో కీలక పాత్రలో నటించారు. బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 25న తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో విడుదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం విజయ్‌ `ఖుషీ` చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నారు. 
 

click me!