
మీడియా తీరుపై విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)తరచుగా అసహనం ప్రదర్శిస్తూ ఉంటారు. పలు సందర్భాల్లో ఆయన మీడియా అత్యుత్సాహం పై ఫైర్ అయ్యారు. సాధారణంగా ఏదైనా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే ఆయన అస్సలు ఊరుకోడు. వంటనే స్పందిస్తాడు. గతంలో పలు మీడియా సంస్థలపై ఆయన యుద్ధం చేశారు. అయితే దానికి భిన్నంగా ఈసారి ఆయనే ఓ ఫేక్ న్యూస్, ఫోటో స్ప్రెడ్ చేయాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు.
విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఓ మూవీ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు ఏప్రిల్ 21న హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి హీరో విజయ్ దేవరకొండతో పాటు మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు హాజరయ్యారు. అలాగే దర్శకుడు కొరటాల శివ, హరీష్ శంకర్ అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చిత్ర యూనిట్ చేశారు.
కాగా సదరు పూజా కార్యక్రమానికి కి సమంత(Samantha)తో పాటు వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ హాజరైనట్లు మార్ఫింగ్ చేసిన ఫోటో విజయ్ దేవరకొండ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. పూజా కార్యక్రమానికి సమంత, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ పాల్గొన్న ఒరిజినల్ ఫోటో ఇది. కాబట్టి ఒరిజినల్ ఫోటో షేర్ చేయాలంటూ మీడియాను కోరారు. నిజానికి సమంతతో పాటు రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిషోర్ ఈ ఈవెంట్ కి హాజరు కాలేదు. మరి విజయ్ దేవరకొండ వాళ్ళు హాజరైనట్లు ఉన్న మార్ఫింగ్ ఫోటో ఎందుకు షేర్ చేశారంటే... కేవలం చిత్ర ప్రమోషన్స్ కోసం.
సినిమా మొదలు కాకుండానే విజయ్ దేవరకొండ ఈ మూవీకి తనదైన ప్రచారం కల్పించే ప్రయత్నం చేశారు. మైత్రి మూవీ మేకర్స్, విజయ్ దేవరకొండ చేసిన ఈ పబ్లిసిటీ స్టంట్ కి నెటిజెన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. సందులో సడేమియా అంటూ మహేష్ ఫ్యాన్స్ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్కారు వారి పాట ప్రమోషన్స్ పై ఇలా ఎందుకు శ్రద్ద పెట్టారంటూ విమర్శిస్తున్నారు. విజయ్ దేవరకొండ 11వ (VD 11) చిత్రంగా తెరకెక్కనున్న ఈ మూవీలో సమంత హీరోయిన్ గా నటిస్తున్నారు.