జమునకు ‘నవరస కళావాణి’ బిరుదు

First Published Sep 19, 2017, 3:09 PM IST
Highlights
  • ఘనంగా సుబ్బిరామిరెడ్డి జన్మదిన వేడుకలు
  • జమునకు నవరస కళావాణి బిరుదు ప్రదానం
  • హాజరైన పలువురు సినీ ప్రముఖులు

అలనాటి అందాల తార జమునకు అరుదైన ఘనత దక్కింది. ఆమెకు ‘నవరస కళావాణి’ బిరుదును ప్రధానం చేస్తూ డా. టి. సుబ్బిరామిరెడ్డి లలితా కళా పరిషత్ స్వర్ణ కంకణాన్ని బహుకరించింది. రాజ్య సభ సభ్యుడు డా. టి. సుబ్బరామిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా విశాఖలోని పోర్టు కళావాణి ఆడిటోరియం లో 'సర్వ ధర్మ సమభావన సమ్మేళనం' కార్యక్రమం నిర్వ హించారు.

 

ఈ సందర్భంగా జమున మాట్లాడుతూ.. తనకు సత్యభామ పాత్ర అంటే ఎంతో  పిచ్చి అని  గుర్తు చేసుకున్నారు. శ్రీకృష్ణ తులాభారం నాటకంలో సత్యభామ పాత్ర వేయగా వచ్చిన మొత్తాన్ని పేదకళాకారులకు ఇచ్చానని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. 

 

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఘంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సుబ్బరామిరెడ్డిని చూసి ఎంతో     నేర్చుకోవాలని అన్నారు. పార్టీలు,కులమతాల కు అతీతంగా ఉండే వ్యక్తి అని కొనియాడారు. అనంతరం నటి బి. సరోజాదేవి మాట్లాడుతూ..జమున తనకు 50 ఏళ్లుగా మంచి స్నేహితురాలని, తనతో కలసి నటించిన సినిమాలను గుర్తు చేసుకున్నారు. 

 

నటి జయసుధ మాట్లాడుతూ.. 12 ఏళ్ళ వయసులో జమునకు కూతురుగా నటించానని, ఇప్పుడు 45 ఏళ్ళ పాటు చిత్ర పరిశ్రమలో కొనసాగుతూ  మళ్ళీ ఆమె ముందుకు వచ్చి నిలబడటం ఎంతో  గర్వంగా ఉందని అన్నారు. అనంతరం సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ.. విశాఖ నగరానికి కూడా సినీ పరిశ్రమను తీసుకు రావటానికి తనవంతు కృషిని చేస్తానని తెలిపారు. ఇక్కడ తానో స్థూడియోను నిర్మిస్తానని అన్నారు.

 

ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ తారలు బి.సరోజాదేవి,వాణిశ్రీ, ప్రభ, శారద,రాజశ్రీ, కాంచన, గీతాంజలి, జయచిత్ర,జయసుధ,జయప్రద, పరుచూరి బ్రదర్స్ గాయనీమణులు జిక్కి, సుశీల,శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, రాజకీయ నాయకులు కె.వి.పి.రామచంద్ర రావు, ద్రోణంరాజు శ్రీనివాసరావు లతో పాటు పలువురు పాల్గొన్నారు. సంగీత దర్శకుడు సాలూరి వాసూరావు ఆధ్వర్యంలో జరిగిన సంగీత విభావరి ఆహుతులను అలరించింది. 

click me!