
ప్రముఖ సినీ నటుడు కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్తానంలో అధికారిక లాంఛనాలతో కైకాల అంత్యక్రియలు జరిగాయి. పోలీసులు గౌరవ వందనం తర్వాత గాలిలోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపి నివాళులర్పించారు. కైకాల పెద్ద కుమారుడు లక్ష్మి నారాయణ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతకుముందు ఫిలింగనర్‌లోని ఆయన నివాసం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర.. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానం వరకు కొనసాగింది. కైకాలకు తుది వీడ్కోలు పలికేందుకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు.
ఇక, గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల సత్యనారాయణ శుక్రవారం తెల్లవారుజామున తన స్వగృహంలోకన్నుమూశారు. నవరస నటనా సార్వభౌముడిగా పేరుపొందిన కైకాల మృతితో సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. తెలుగు చిత్రపరిశ్రమలో 60 సంవత్సరాల కెరీర్‌ను కలిగి ఉన్న కైకాల సత్యనారాయణ.. వివిధ పాత్రలకు ప్రాణం పోశారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కామెడియన్‌గా రకరకాల పాత్రల్లో దాదాపు 770కి పైగా సినిమాల్లో అలరించారు.
1935 జూలై 25న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో జన్మించిన కైకాల సత్యనారాయణ.. 1959లో సిపాయి కూతురు సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. 2009లో అరుంధతి సినిమా తరువాత నటనకు దూరంగా ఉంటూ వచ్చారు. మహర్షి సినిమాలో కైకాల చివరిసారిగా కనిపించారు. మాజీ సీఎం ఎన్టీఆర్‌కు సన్నిహిత మిత్రుడైన కైకాల సత్యనారాయణ 1996లో మచిలీపట్నం నుంచి టీడీపీ టికెట్‌పై 11వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. అయితే ఆ తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు. ఇక, కైకాలకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ఇక, కైకాల సత్యనారాయణ మృతిపట్ల ప్రధాని మోదీతో సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. కైకాల భౌతికకాయానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, సినీ ప్రముఖులు చిరంజీవి, పవన్ కల్యాణ్, రాజేంద్ర ప్రసాద్, త్రివిక్రమ్ శ్రీనివాస్.. తదితరులు నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.