
తెలుగు సినీ, టెలివిజన్ పరిశ్రమలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ప్రముఖ సినీ, టీవీ నటుడు అల్లం గోపాలరావు శనివారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉదయం 8 గంటలకు తుదిశ్వాస విడిచారు. అల్లం గోపాలరావు వయసు 75 సంవత్సరాలు.
అల్లం గోపాలరావు తెలుగు సీరియల్స్ లో ఎన్నో పాత్రల్లో కనిపించారు. అంతే కాదు కొన్ని సినిమాల్లో కూడా కీలక పాత్రలు పోషించారు. నటనతో తనదైన ముద్ర వేసిన ఆయన, ప్రేక్షకుల్లో విశేషమైన గుర్తింపు పొందారు. ఆయనకు భార్య విమల, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు అనిల్ సినిమాలు, సీరియల్స్‌లో నటిస్తున్నారు. పద్మవ్యూహం సీరియల్ లో అనిల్ టెలివిజన్ కు పరిచయం అయ్యారు. ప్రస్తుతం సీనియర్ నటుడిగా కొనసాగుతున్నారు.
గోపాలరావు మృతిపట్ల టాలీవుడ్, టెలివిజన్ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు. ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ (FNCC) మేనేజ్మెంట్ కమిటీ ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేసింది. అభిమానులు, సహనటులు సోషల్ మీడియాలో సంతాప సందేశాలు పోస్ట్ చేస్తున్నారు.
కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, అల్లం గోపాలరావు అంత్యక్రియలు ఈరోజు శనివారం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌లోని మహాప్రాస్థానంలో జరగనున్నాయి. అభిమానులు, సహచరులు ఆయనకు చివరిసారి నివాళులు అర్పిస్తున్నారు.
తెలుగు టెలివిజన్ రంగంలో విలక్షణమైన నటనకు చిరునామాగా నిలిచారు అల్లం గోపాలరావు . ఆయన మృతి పరిశ్రమలో పెద్ద లోటు. ఆయన చేసిన పాత్రలు, నటన మాత్రం టెలివిజన్ చరిత్రలో నిలిచిపోతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.