
మహేష్ బాబు హీరోగా, ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం SSMB 29. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. త్వరలో మూడో షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. జూలై రెండో వారం నుంచి ఈ షెడ్యూల్ కెన్యాలో ప్రారంభంకానున్నట్లు సమాచారం.
ఈ షెడ్యూల్ లో రాజమౌళి భారీ యాక్షన్ ఎపిసోడ్స్, ఛేజ్ సీక్వెన్స్‌లు చిత్రీకరించబోతున్నట్టు తెలుస్తోంది. ప్రకృతి అందాలతో అలరించే కెన్యా లొకేషన్లలో, అటవీ ప్రాంతంలో నెలరోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో రాజమౌళి, మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర చిత్ర యూనిట్ మొత్తం కెన్యాకు త్వరలో పయనం కాబోతున్నారు.
కెన్యాలో ఈ చిత్ర షూటింగ్ కి సంబంధించిన అన్ని అనుమతులు లభించినట్లు తెలుస్తోంది. కెన్యా లోని వివిధ లొకేషన్స్ తో పాటు అక్కడ ఉన్న ప్రఖ్యాత అంబోసెలి నేషనల్ పార్క్ లో కూడా రాజమౌళి కొన్ని కీలక సన్నివేశాలని చిత్రీకరించబోతున్నారట. ఇండియన్ సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా రాజమౌళి ఈ ప్రాజెక్ట్‌ను భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు.
ఈ చిత్రం కోసం మహేష్ బాబు కంప్లీట్ గా డిఫెరెంట్ గెటప్ లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఫిట్‌నెస్, లుక్స్ ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేశాయి.ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల మనసులను దోచుకునేలా భారీ స్థాయిలో నిర్మాణం సాగుతోంది.ఈ చిత్రానికి కీరవాణి సంగీతం, విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు. 1000 కోట్ల బడ్జెట్ లో కెఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.