కమెడియన్ వెన్నెల కిశోర్ హీరోగా మారి చేసిన `చారి 111` గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించింది టీమ్. `బేబీ` బ్యూటీ వైష్ణవీ చైతన్య నెక్ట్స్ మూవీ ప్రకటన వచ్చింది.
'వెన్నెల' కిశోర్ హీరోగా నటించిన సినిమా 'చారి 111'. జేమ్స్ బాండ్ స్టయిల్‌లో ఈ మూవీని రూపొందించారు. కాన్సెప్ట్ కూడా అలానే సాగుతుంది. అయితే వెన్నెల కిశోర్ హీరో ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ట్రైలర్‌లో హీరోగా ఆయన పోజ్ ఇవ్వగా, హీరోయిన్.. నువ్వే ఏం చేసినా కమెడియనే అని చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఇందులోని కామెడీ సినిమాపై ఇంట్రెస్ట్ ని పెంచుతుంది. దాన్ని టీమ్ మరింత పెంచే ప్రయత్నం చేసింది.
'మళ్ళీ మొదలైంది' ఫేమ్ టీజీ కీర్తీ కుమార్ దర్శకత్వంలో బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ ఈ `చారి 111` మూవీని నిర్మించారు. సంయుక్తా విశ్వనాథన్ కథానాయికగా, మురళీ శర్మ ప్రధాన పాత్రలో నటించారు. మార్చి 1న థియేటర్లలో సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం టీమ్ ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. ఈ మూవీని మేలో విడుదల చేయాలనుకున్నారట. కానీ ముందుకు రావడంతో వెన్నెల కిషోర్‌కి టైమ్ సెట్ కావడం లేదని, అందుకే ఈవెంట్లలో పాల్గొనలేకపోతున్నట్టు తెలిపారు.
ఇందులో పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ, `ఈ సినిమాలో ఒక్కటే పాట ఉంది. అది రాసే బాధ్యత నాకు అప్పగించారు. సంగీత దర్శకుడికి మన భాష కాదు. దర్శకుడు కీర్తి యాడ్ ఫిలిమ్స్ నుంచి వచ్చారు. ఈ పాట రాయడానికి మూడు నెలల సమయం తీసుకున్నా. వెంటనే రాయలేక కాదు, నన్ను నమ్మి రావడంతో అద్భుతంగా రాయాలని కృషి చేశా. సైమన్ కె కింగ్ మంచి బాణీ ఇచ్చారు. మంచి సాహిత్యం కుదిరింది. వెన్నెల కిశోర్ ప్రేక్షకులు అందరికీ ఇష్టమైన నటుడు. ఆయన తప్పకుండా నవ్విస్తారు` అని తెలిపారు.
దర్శకుడు టీజీ కీర్తీ కుమార్ మాట్లాడుతూ, ఇదొక స్పై యాక్షన్ కామెడీ జానర్ ఫిల్మ్. కమర్షియల్ సినిమాలకు ఏమాత్రం తక్కువ కాకుండా ఉంటుంది. నేను రామ జోగయ్య శాస్త్రి గారి సాహిత్యానికి పెద్ద 'మళ్ళీ మొదలైంది' సినిమాలో పాటలు రాయించుకోవాలని అనుకున్నా. కానీ, కుదరలేదు. ఈ సినిమాతో కుదిరింది. థీమ్ సాంగ్ అద్భుతంగా రాశారు. సంయుక్తా విశ్వనాథన్ యాక్షన్ కూడా చేసింది. మా నిర్మాత అదితి తెలుగులో వరుసగా సినిమాలు చేస్తారు` అని చెప్పారు.
నిర్మాత అదితి సోనీ మాట్లాడుతూ, `నిర్మాతగా నా తొలి సినిమా ఇది. సంథింగ్ డిఫరెంట్, కొత్తగా ట్రై చేశాం. ఫెంటాస్టిక్ టీం కుదిరింది. వెన్నెల కిశోర్ కి నేను పెద్ద ఫ్యాన్. ఆయనతో సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. మార్చి 1న మా సినిమా విడుదల అవుతోంది. ప్రేక్షకులు అందరూ తప్పకుండా థియేటర్లకు వెళ్లి చూస్తారని ఆశిస్తున్నాను. మంచి ఫన్ ఫిల్మ్ ఇది. ఎంజాయ్ చేస్తారు'' అని అన్నారు.
`లవ్ మీ` అంటోన్న `బేబీ` బ్యూటీ వైష్ణవీ చైతన్య..
`బేబీ` సినిమాతో ఒక్కసారిగా స్టార్ అయిపోయింది వైష్ణవీ చైతన్య. ఆ మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ కావడంతో ఈ అమ్మడికి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అందులో భాగంగా ఇప్పుడు తన నెక్ట్స్ సినిమాని ప్రకటించింది. ఆమె దిల్‌రాజు బ్యానర్‌లో మూవీ చేస్తుండటం విశేషం. దిల్ రాజుసోదరుడి కొడుకు ఆశిష్ హీరోగా రూపొందుతున్న సినిమాలో హీరోయిన్‌గా చేస్తుంది. తాజాగా ఈ మూవీని ప్రకటించారు. `లవ్ మీ`(ఇఫ్ యూ డేర్) అనే టైటిల్‌ని ప్రకటించారు. రొమాంటిక్ హర్రర్‌గా ఈ మూవీ రూపొందుతున్నట్టు తెలుస్తుంది.
శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించారు. ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వాన్ని వహించారు. దిల్ రాజు మాట్లాడుతూ, `లవ్ మీః ఇఫ్ యూ డేర్` అనేది మొదలవ్వడానికి నాగ, అరుణ్ కారణం. ఈ స్క్రిప్ట్ విన్న క్షణమే ఓ ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లా. `ఆర్య` కథ విన్నప్పుడు ఎలా ఎగ్జైట్ అయ్యానో.. మళ్లీ అలా ఎగ్జైట్ అయ్యాను. ఇదొక న్యూ ఏజ్ ఫిల్మ్. ఆశిష్ హీరోగా కావాలని అడిగారు. అలానే హర్షిత్, హన్షిత్‌ను ఇవ్వండని నాగ అడిగారు. కథ చెప్పి నన్ను గెలిచారు. కొత్త వాళ్లతో ‘బలగం’ తీశాం. కొత్త వాళ్లని ఎంకరేజ్ చేయాలని దిల్ రాజు ప్రొడక్షన్స్ పెట్టాం. ఈ కథను చాలా మందికి చెప్పాం. అందరూ ఎగ్జైట్ అయ్యారు.
స్క్రిప్ట్ పూర్తయ్యాక.. టెక్నీషియన్స్ పేర్లు చెబితే భయం వేసింది. పీసీ శ్రీరామ్ కి స్క్రిప్ట్ వినమని చెప్పాను. ఆయన స్క్రిప్ట్ చదివి వెంటనే ఓకే చెప్పారు. మ్యూజిక్ విషయంలో కీరవాణి కావాలన్నారు. కీరవాణి అప్రోచ్ అయి స్క్రిప్ట్ వినిపించారు. ఆయన కూడా స్క్రిప్ట్ విని వెంటనే ఓకే చెప్పారు. హీరోయిన్ కోసం వెతుకుతున్న టైంలో బేబీ పెద్ద హిట్ అయింది. ఆఫీస్‌కు వచ్చి స్క్రిప్ట్ పూర్తిగా చదివి ఫుల్ ఎగ్జైట్ అయింది. ఇలా ఓ స్క్రిప్ట్ ఈ రేంజ్‌లో ఎగ్జైట్ చేయించడం చాలా అరుదుగా చూస్తాం. ఇక సినిమా విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాబట్టుకుంటుందని నాకు నమ్మకంగా ఉంది. ఏప్రిల్ 27న సినిమాను రిలీజ్ చేయబోతోన్నాం` అన్నారు దిల్ రాజు.
వైష్ణవి చైతన్య మాట్లాడుతూ, `లవ్ మీః ఇఫ్ యూ డేర్’ కథ విన్నప్పటి నుంచి ఇప్పటికీ నాకు ఆ వైబ్స్ వస్తుంటాయి. అదే ఎగ్జైట్మెంట్ ఇప్పటికీ ఉంది. ఈ మూవీ నాకు చాలా ప్రత్యేకం. ఇలాంటి పాయింట్, లైన్‌ను ఇది వరకెప్పుడూ చూడలేదు. త్వరలోనే టీజర్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. టీజర్ అందరికీ డిఫరెంట్ వైబ్‌ను కలిగిస్తుంది. థియేటర్లోంచి బయటకు వచ్చేటప్పుడు మాత్రం డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్‌తో వస్తారు’ అని అన్నారు.