
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ 2025లో సంచలన విజయం సాధించింది. 18 ఏళ్లుగా ఐపీఎల్ కప్ కోసం నిరీక్షించగా, ఇన్నాళ్లకి ఆ అరుదైన విజయం సొంతమైంది. మొదటిసారి ఆర్సీబీ ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచింది.
దీంతో విరాట్ కోహ్లీకి, ఆయన టీమ్ ఆనందానికి అవదుల్లేవ్. ఆర్సీబీ విన్నర్‌గా నిలిచిన తర్వాత కోహ్లీ ఎమోషనల్ అయ్యారు. కంటతడి పెట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఇక ఆర్సీబీ సంచలన విజయం పట్ల, 18ఏళ్ల తర్వాత ఐపీఎల్ ట్రోఫీ సాధించడం పట్ల సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఆర్సీబీకి, కోహ్లీకి అభినందనలు తెలియజేస్తున్నారు. వెంకటేష్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, నాగవంశీ, సుధీర్ బాబు, కార్తికేయ వంటి సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలియజేశారు. వారు ఏమన్నారో చూద్దాం.
`రానా నాయుడు` సీజన్ 2 ట్రైలర్‌తో రచ్చ చేస్తున్న వెంకటేష్.. ఆర్సీబీ విజయంపై స్పందిస్తూ, ఫస్ట్ టైమ్ ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఆర్సీబీ టీమ్‌కి, విరాట్ కోహ్లీకి నా అభినందనలు. 18 ఏళ్ల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించినందుకు చాలా సంతోషంగా ఉంది. టోర్నమెంట్ అంతా జట్టు హృదయపూర్వకంగా, ఉత్సాహంగా, అత్యుత్తమ నైపుణ్యంతో ఆడింది. నిజంగా అర్హత కలిగిన విజయం` అని ట్వీట్ చేశారు వెంకీ.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందిస్తూ, `నిరీక్షణ ముగిసింది. చివరికి సాలా ఈ సారి కప్ మనదే. 18 ఏళ్లుగా ఈ రోజు కోసం ఎదురుచూస్తున్నాం. ఆర్‌సీబీకి పెద్ద అభినందనలు` అని విష్ చేశారు బన్నీ.
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ స్పందిస్తూ, ఆర్సీబీకి, ఆర్సీబీ అభిమానులకు అభినందనలు. మీరు చాలా శక్తితో, అభిరుచితో, ప్రేమతో వేచి ఉన్నారు. చూడ్డానికి ఇది చాలా సంతోషకరమైన క్షణం` అని వెల్లడించారు విజయ్.
సాయిధరమ్ తేజ్ స్పందిస్తూ, చాలా సార్లు ట్రోల్స్ కి గురయ్యారు, చాలా సార్లు ఓడిపోయారు. చాలా సార్లు పక్కన పెట్టారు, చాలా సార్లు వదులుకున్నారు. ఇవన్నీ జరిగినా వారు ముందుకు సాగి అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే వారు ఎప్పుడూ వదిలేయలేదు. ఈ విజయం సాధించడానికి జట్టు కొన్ని ఏళ్లుగా కృషి చేసింది. అభినందనలు ఆర్సీబీ. మీరు ఈ విజయంలో ప్రతి దానికి అర్హులు. అభిమానులు ఈ విజయాన్ని మీ ఛాతీని కొట్టి గర్వంగా చెప్పుకోవచ్చు` అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.
మరో హీరో సుధీర్ బాబు స్పందిస్తూ, `చారిత్రాత్మక విజయం సాధించిన ఆర్సీబీకి, విరాట్ కోహ్లీకి అభినందనలు. 18 ఏళ్ల పట్టుదల, అభిరుచి, అచంచలమైన మద్దతు తర్వాత చివరకు కల సాకారం అయ్యింది. టీమ్, అభిమానులు ఈవిజయానికి అన్ని రకాలుగా అర్హులు` అని తెలిపారు.
వరుణ్ తేజ్ స్పందిస్తూ, 18ఏళ్ల తర్వాత రాజు విజయం సాధించాడు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న టైటిల్‌ని గెలుచుకున్నందుకు అభినందనలు ఆర్సీబీ` అని ట్వీట్ చేశాడు వరుణ్.
నిర్మాత నాగవంశీ స్పందిస్తూ, 18 ఏళ్లు లెక్కలేనన్ని పోరాటాలు, అంతులేని నమ్మకం. రాజు కోహ్లీ దానికి అన్నీ ఇచ్చాడు. అతని చెమట, అతని, ఆత్మ, అతని అగ్ని, ఇప్పుడు చివరకు, అతను పోరాటానికి ఫలితం వచ్చింది. ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీని ఎత్తే రోజు. ప్రతి అభిమాని ఎదురుచూస్తున్న రోజు. రాజు తన వారసత్వాన్ని పూర్తి చేసే రోజు. ఇవన్నీ ఉన్నప్పటికీ ఉన్నతంగా నిలిచిన ప్రతి ఒక్క మద్దతుదారునికి ఇది గర్వపడే రోజు. ఆర్సీబీ అభిమానులు ఇది మీ క్షణం. `సాలా ఈ కప్ నమ్డు, నిమ్దే` అని తెలిపారు నాగవంశీ.