
టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లోనూ ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఈ టెక్నాలజీ వల్ల లాభాలున్నప్పటికీ, ఎంతమంది ఉద్యోగాలు పోతాయో అన్న భయం కూడా ఉంది.
ఈ నేపథ్యంలో సినిమా రంగంలో పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఉపయోగించి సినిమా తీశారు. కన్నడలో AIతో తయారైన ‘ఐ లవ్ యూ’ అనే సినిమా ఇటీవల విడుదలైంది.
90 నిమిషాల నిడివి గల ఈ సినిమా కేవలం రూ.10 లక్షల బడ్జెట్‌తో తయారైంది. ఈ సినిమాలోని 12 పాటలను AI కంపోజ్ చేసింది. హీరో, హీరోయిన్, ఇతర పాత్రలన్నీ AIతోనే తయారు చేశారు.
ఇండియన్ సినిమాల్లో AI వాడటం ఇదే మొదటిసారి కాదు. కానీ పూర్తిగా AI టెక్నాలజీతో తయారైన ఈ సినిమాకి సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికెట్ ఇచ్చింది. మొత్తానికి ఈ చిత్రం ఆడియెన్స్ ముందుకు వచ్చింది.
బెంగళూరుకు చెందిన నరసింహమూర్తి అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఎక్స్‌పర్ట్ ఈ సినిమాలో 30కి పైగా AI సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించారు. ఈ సినిమాలోని మ్యూజిక్, విజువల్స్, క్యారెక్టర్స్, ట్రోల్ సీన్స్ అన్నీ AIతోనే తయారయ్యాయి.
సినిమాటోగ్రఫీ, ఆర్ట్, ఫైట్స్ అన్నీ AIతోనే చేశారని చెబుతున్నారు. పాటల రచన, కథ, స్క్రీన్ ప్లే, ఫైనల్ ఎడిటింగ్ మాత్రమే మనుషులు చేశారు. ఆరు నెలల్లో కేవలం రూ.10 లక్షలతో ఈ సినిమాని రూపొందించారు.
`ఐ లవ్యూ` మూవీ కథ విషయానికొస్తే, నూతన్ అనే సింగర్ మనాలీకి ట్రిప్ వెళ్తాడు. అక్కడ అశ్విని అనే సింగర్‌ని కలుస్తాడు. ఇద్దరు కలిసి ట్రావెల్ చేస్తారు. ప్రేమలో పడతారు. ఆ తర్వాత వాళ్ళు ఎదుర్కొనే సమస్యలేంటి? వాళ్లు ప్రేమలో గెలిచారా? అనేదే కథ.
AIతో తయారైనందున లిప్ సింక్, ఇతర సమస్యల వల్ల డైలాగ్స్ తక్కువగా ఉన్నాయి. 12 పాటలున్నందున సినిమా ఎక్కువగా పాటల మీదే ఆధారపడి ఉంది. రియలిస్టిక్ సీన్స్ లేవు. లవ్ సీన్స్‌లో ఎమోషన్స్ కనిపించలేదు. యానిమేషన్ సినిమాలా కూడా లేదని విమర్శలు వచ్చాయి.
మంచి సినిమాలు రావాలంటే మంచి కథ, మంచి టెక్నాలజీ, ఎమోషన్స్‌ని పలికించే నిజమైన మనుషులు కావాలని సినీ విమర్శకులు అంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రమాదకరంగా మారుతోంది.
ఇది మనుషుల ఉద్యోగాలను లాక్కుంటుంది, ఆర్టిఫిషియాలిటీని పెంచుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏ టెక్నాలజీ అయినా, దాన్ని మితంగా వాడితేనే లాభాలుంటాయి. మితిమీరితే ఏదైనా విషమే అంటున్నారు. ఈ మూవీ కూడా ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది.