ప్రముఖ దర్శకుడు వియన్ ఆదిత్య తాజా చిత్రం ‘వాళ్ళిద్దరి మధ్య’.ఈ సినిమాని బిగ్ స్క్రీన్ పై కాకుండా నేరుగా ఆహా ఓటీటీలో రిలీజ్ చేశారు. మరి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ గా తీసిన ఈ సినిమా ఎలా ఉంది?
ఓటీటి సినిమా అనగానే మనకు థ్రిల్లర్స్, హారర్స్, సైకోపాత్ సినిమాలే గుర్తు వస్తాయి.మళయాళ డబ్బింగ్ సినిమాలదే రాజ్యం అన్నట్లుగా హవా సాగుతూంటుంది. అయితే అదే ఓటిటీలో మంచి ప్రేమ కథను చెప్పలేరా..ఫ్యామిలీ ఎమోషన్స్ తో సినిమాలు రావా అంటే అక్కడ లెక్కల ఏమి ఉన్నాయో తెలియదు. కానీ ఆ లెక్కలేవీ వంటపట్టించుకోకుండా తను నమ్మిన ఓ ప్రేమ కథతో మన ముందుకు వచ్చారు సీనియర్ డైరక్టర్ వీఎన్ ఆదిత్య. దాదాపు అంతా కొత్తవాళ్లతో కంటెంట్ నే నమ్ముకుని వచ్చిన ఈ చిత్రం ఏ మేరకు ఆడియన్స్ ని ఆకట్టుకుంది. అసలు కథేంటి..చూడదగ్గ సినిమాయేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
స్టోరీ లైన్
ఈ కాలం కుర్రాడు వరుణ్ (విరాజ్ అశ్విన్) ..సొంతంగా అన్వయ అనే కంపెనీ పెట్టి ఎన్నారై తల్లి,తండ్రులకు సాయిం అందిస్తూ,సర్వీస్ లోనే బిజినెస్ ని చూసుకుంటాడు. ఇక అమెరికాలో ఉండే అన్వయ (నేహా కృష్ణ) మోడ్రన్ అమ్మాయి. ఆమె తల్లితండ్రులు వరుణ్ కు క్లైయింట్స్. దాంతో వాళ్లిద్దరి పరిచయం ఆన్ లైన్ వేదికగా అవుతుంది. ఆమెను చూసిన వెంటనే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేస్తాడు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్. ఆమె ఆల్రెడీ బ్రేక్ అప్ అయ్యి ఆ వేదనలో ఉంది. దాన్ని మర్చిపోయే పనిలో ఇండియా వస్తుంది. ఆమె ఇండియా వచ్చిందని తెలుసుకున్న వరుణ్ ఆమెని కలిసి దగ్గర అవటానికి ప్రయత్నిస్తాడు. ఇద్దరూ ఒకరికి మరొకరు నచ్చి ఇక పెళ్లి చేసుకుంటారు అనుకునే టైమ్ లో వారిద్దరి మధ్యా ఓ అపార్దం చోటు చేసుకుని విడిపోతారు. అందుకు కారణం లోమా అనే ఓ వ్యక్తి అని తెలుస్తుంది. ఇంతకీ లోమా ఎవరు.. అతనికి వీళ్ల లవ్ స్టోరీ బ్రేక్ అప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. లోమా గురించి వరుణ్, అన్వయ తెలుసుకున్నారా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
undefined
ఎలా ఉందంటే...
ప్రేమ కథలను బాగా డీల్ చేయగలరు అనే పేరు ఉంది దర్శకుడుగా వియన్ ఆదిత్యకు. సున్నితమైన భావోద్వేగాలతో సహజంగా కథను నడించగల సత్తా ఆయన సొంతం. అయితే అంతా కొత్త వాళ్లు కావటం వల్లనో, బడ్జెట్ లిమిటేషన్ వల్లనో ఆ మ్యాజిక్ పూర్తిగా కనపడదు. అయితే ఓ ప్రేమ కధగా చూడటానికి ఈ సినిమా ఇబ్బంది పెట్టదు. మొదటి పదినిముషాలు సర్దుకోవటానికి టైమ్ పడుతుంది. ఆ తర్వాత కథలోకి వెళ్లిపోయాక, లీడ్ పెయిర్ కలుస్తారా లేదా అన్న ఆసక్తి మొదలవుతుంది. తమ మధ్య ఉన్న లోమాను ఎదుర్కోవటానికి వాళ్లు ఏం చేసారు.. లోమా ఊరుకున్నాడా ..ఎదురు దాడి చేసాడా అనేది ఇంట్రస్టింగ్ గా ఉంది. అయితే ఆయన సినిమాల్లో కనిపించే ఫన్ ఇందులో పెద్దగా లేదు. పూర్తి కొత్తదనం అని చెప్పలేం కాని..రెగ్యులర్ కథ,కథనం అయితే కాదు. ఇక స్క్రీన్ ప్లే కూడా కథను ముందుకు వేగంగా తీసుకెళ్లటంలో సహకరించింది. ఎక్కడా హైప్ కోసం దిగజారి ఏ ప్రయత్నాలు చేయలేదు. తాను చెప్పాలనుకన్న కథను హుందాగా చెప్పుకుంటూ వెళ్లిపోయారు. ఓటిటి లలో ఉన్న సుఖం కూడా అదే. పనిగట్టుకుని ఏ ప్రేక్షకుడుని అలరించటానికి ప్రయత్నించక్కర్లేదు. హృదయానికి తాకేలా కొన్ని ఎమోషన్స్ ఉంటే చాలు. క్లైమాక్స్ కాస్త కొత్తగా ఉంటే బాగుండేది.
నటీనటుల్లో ...
కొత్తవాడైనా విరాజ్ అశ్విన్..హీరోగా, లోమా గా రెండు పాత్రల్లో తడబాటు లేకుండా చేసారు. హీరోయిన్ నేహా కృష్ణ బాగుంది. రీమాసేన్ గుర్తు వచ్చింది. దర్శకుడు,రచయిత, నిర్మాత వెంకట సిద్దారెడ్డి ఈ సినిమాలో తొలిసారి నటుడుగానూ కనిపించారు. బాగా చేసారు. మిగిలిన నటీనటులు కూడా వాళ్ల పాత్రల పరిధి మేరకు నటించారు.
టెక్నికల్ గా చూస్తే...
దర్శకుడుగా వియఎన్ ఆదిత్య గత చిత్రాల స్దాయి అని చెప్పలేం. అయితే వాటిలో ఉన్న హీరోలు ,బడ్జెట్ లు వేరు అని, చిన్న సినిమాకు లిమిటేషన్స్ ఉంటాయని కూడా గుర్తు పెట్టుకోవాలి. సినిమా లెంగ్త్ కాస్త ఎక్కువే అనిపించింది. క్లైమాక్స్ కూడా రొటీన్ ఫీలింగ్ వచ్చింది. లాస్ట్ లో ఏ ట్విస్ట్ ఇవ్వకపోవటమే ట్విస్ట్ . సినిమాటోగ్రఫీ బాగుంది. మధు స్రవంతి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాటలు సోసోగా ఉన్నాయి. డైలాగులు బాగున్నాయి. థియోటర్ లో కొన్ని పేలేవే. పాటల రచయితగా సిరాశ్రీ గురించి కొత్తగా చెప్పేదేముంది. ఎప్పటిలాగే బాగా రాసారు.
ఫైనల్ థాట్...
ఓటిటి సినిమా అనగానే శవాలు, హత్యలు,ఇన్విస్టిగేషన్ అనే రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్స్ నుంచి చక్కటి డీవియేషన్. ఓ సారి ట్రై చేయచ్చు.
Rating: 2.5
---సూర్య ప్రకాష్ జోశ్యుల
బ్యానర్: వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్
నటీనటులు: విరాజ్ అశ్విన్, నేహా కృష్ణ, వెంకట్ సిద్ధారెడ్డి, బిందు చంద్రమౌళి, సాయి శ్రీనివాస్ వడ్లమాని, జయశ్రీ రాచకొండ, శ్రీకాంత్ అయ్యంగార్, నిహారికా రెడ్డి, ప్రశాంత్ సిద్ది, సుప్రజ, కృష్ణ కాంత్, అలీ, భార్గవ్, రామకృష్ణ తదితరులు
సంగీతం: మధు స్రవంతి
పాటలు: సిరాశ్రీ
కెమెరా: రాకేష్ కోలంచి
ఆర్ట్: జెకే మూర్తి
ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల
స్క్రీన్ ప్లే: సత్యానంద్
మాటలు: వెంకట్ డి పతి
లైన్ ప్రొడ్యూసర్: శ్రావణ్ నిడమానూరి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సూరపనేని కిషోర్
నిర్మాత: అర్జున్ దాస్యన్
కథ, దర్శకత్వం: వీఎన్ ఆదిత్య
విడుదల తేదీ : డిసెంబర్ 16, 2022