
యురి సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకొని మంచి గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు విక్కీ కౌశల్ షూటింగ్ లో గాయపడినట్లు తెలుస్తోంది. ఒక సినిమా షూటింగ్ లో భాగంగా యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తుండగా ప్రమాదానికి గురైనట్లు సమాచారం.
అసలు వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తెలిపిన సమాచారం ప్రకారం.. యాక్షన్ సీన్స్ లో నటిస్తుండగా డోర్ పై పడ్డ విక్కీ కౌశల్ కి తీవ్ర గాయాలయ్యాయి. దవడ ఎముక పగిలి రక్తం వచ్చింది. వెంటనే చిత్ర యూనిట్ సమీపంలోని ప్రయివేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అనంతరం ముంబైలోని ఆసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడ విక్కీకి పదమూడు కుట్లు వేసినట్లు ఆదర్శ్ తెలిపారు.
ప్రముఖ దర్శకుడు బాను ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్న గుజరాత్ హారర్ మూవీ షూటింగ్ లో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. యురి సినిమా అనంతరం దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న విక్కీ బాలీవుడ్ నుంచి కూడా మంచి ఆఫర్స్ అందుకుంటున్నాడు.