
మంగళవారం కైకలూరు మండలం కొల్లేటికోట రోడ్డులో సర్కార్ కాల్వ వంతెనపై మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ చిత్ర సన్నివేశాలను చిత్రీకరించారు. హీరో రామ్‌చరణ్ చిత్రం షూటింగ్ జరుగుతోందని తెలుసుకున్న అభిమానులు కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు. సర్కార్ కాల్వ వంతెనపై బైక్‌కు ఆయిల్ ఇంజన్‌ను కట్టుకుని వ్యవసాయ పనుల కోసం వెళుతున్న సన్నివేశాలను కెమెరా మ్యాన్ రత్నవేలు చిత్రీకరించారు.
ఈ సందర్భంగా షూటింగ్ లొకేషన్ కు వెళ్లిన రామ్ చరణ్ సతీమణి ఉపాసన కామినేని అక్కడి కొల్లేరు అందాలను ఎంతగానో నచ్చాయని చెప్పారు. తనకు కొల్లేటి చేపల వేట బాగా నచ్చిందని ఉపాసన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. తాను షూటింగ్ లొకేషన్ లో రామ్ చరణ్ తో తీసుకున్న సెల్ఫీని ట్విటర్ లో పోస్ట్ చేసి మెగా అభిమానులకు ఖుషీ చేశారు.
ఈ సందర్భంగా తాను గోదావరి జిల్లాకు చెందిన వాడినైనా కొల్లేరు ఖ్యాతిని వినడమే కాని, ఎప్పుడూ చూడలేదని దర్శకుడు సుకుమార్ అన్నారు. గతంలో కొల్లేరు సరస్సులో చిన్న సినిమాలు నిర్మించడం వలన ఈ ప్రాంతంపై ప్రచారం తక్కువగా జరిగిందని అన్నారు. అగ్ర హీరో రామ్‌చరణ్‌తో చిత్రం చేయడం వలన తెలుగు సినీ ప్రేక్షకులకు చూపు మరోసారి కొల్లేరువైపు పడుతుందన్నారు. కొల్లేరులో చిత్రషూటింగ్ చేయడం బాగుందని, ఇక్కడ ప్రదేశం షూటింగ్ చేసేందుకు అనువుగా ఉందన్నారు. భారీ బడ్జెట్‌తో రామ్‌చరణ్ హీరోగా నిర్మిస్తున్న సినిమాకు నవీన్ ఎర్నేని, చెరుకూరి వెంకట్, యలమంచలి రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కొల్లేరు సరస్సు గురించి వినడమే తప్ప ప్రత్యక్షంగా చూడడం, సినిమా చ్రితీకరించడం అనేది జీవితంలో మరుపురాని అంశంగా గుర్తుంటుందని సినీ దర్శకుడు సుకుమార్ వెల్లడించారు.
గతంలో ఆయన నిర్మించిన చిత్రాల కంటే బ్లాక్‌బాస్టర్ హిట్ సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో సమంత హీరోయిన్‌గా నటిస్తుందని, ఆది పినిశెట్టి, జగపతిబాబు, హాస్యనటులుగా జబర్దస్త్ మహేష్, సత్య, పృధ్వీరాజ్ తదితర తారాగణం నటిస్తున్నట్లు తెలిపారు. హీరో రామ్‌చరణ్‌ను ఏలూరు ఎంపీ కలిసి అక్కడ ఏర్పాట్లను ఆరా తీశారు. మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు కొల్లి వరప్రసాద్, నల్లగోపుల చలపతి, అలిండియా మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు స్వామి నాయుడు తదితరులు హీరో రామ్‌చరణ్‌కు స్వాగతం పలికారు.
.