
కమల్‌హాసన్, జల్లికట్టుని సమర్థించాడు. రజనీకాంత్‌దీ అదే రూటు. కానీ, కాస్త భిన్నంగా ఆలోచించి త్రిష పెద్ద తప్పే చేసేసినట్టుంది. ఇంకేముంది, త్రిషకి వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి. త్రిషని చంపేస్తామంటూ బెదిరింపులు షురూ అయ్యాయట. మరోపక్క, తమ కుటుంబంపై ఒత్తిడిని తట్టుకోలేక త్రిష కుటుంబం, పోలీసులను ఆశ్రయించింది. సాక్షాత్తూ త్రిష తల్లి, పోలీస్ బాస్‌ని కలిసి అసలు త్రిష ఎక్కడా జల్లికట్టుకి వ్యతిరేకమని చెప్పలేదంటూ మొరపెట్టుకోవడం గమనార్హం. త్రిష సోషల్ మీడియా అక్కౌంట్స్ హ్యాక్ అయ్యాయనీ, ఈ విషయమై వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది.
ఇది నిజంగానే పెద్ద ట్విస్ట్ కదా. త్రిష ఎప్పటినుంచో 'పెటా' సంస్థ తరఫున పలు అవగాహనా కార్యక్రమాల్లో పాల్గొంటోంది. వీధి కుక్కల్ని దత్తత తీసుకోవాలనీ, అలాగే ఏ ఉద్దేశ్యంతో అయినాసరే జంతువుల్ని హింసించరాదనీ నినదిస్తుంటుంది త్రిష. ఈ క్రమంలోనే త్రిష, జల్లికట్టుని వ్యతిరేకించింది. కానీ, ఇప్పుడు త్రిష తల్లి పోలీసుల్ని ఆశ్రయించడమంటే.. అదంతా తమిళనాడులో 'సెంటిమెంట్' దెబ్బ తాలూకు ఎఫెక్ట్ అని అనుకోవాలేమో.!