
ఇండస్ట్రీలో ఏ క్షణం ఏదైనా జరగచ్చు. ఇవాళ అనుకున్నది కొంతకాలానికి మొత్తం మారిపోయి వేరొక సెటప్ లోకి వెళ్లిపోవచ్చు. అలా ఒక హీరోతో అనుకున్న చాలా ప్రాజెక్టులు మరో హీరోకు వెళ్లిపోవటం చూస్తూ వచ్చాం. అలాంటిదే తాజాగా చిరంజీవితో వంటి మెగాస్టార్ తో అనుకున్న ప్రాజెక్టు ..సందీప్ కిషన్ చేతికి వెళ్లిందనే వార్త వినిపిస్తోంది. రచయిత బెజవాడప్రసన్నకుమార్ ఓ కథ రాస్తే, #Chiranjeevi కి నచ్చడంతో అక్కడ కొన్నాళ్లపాటు కసరత్తు జరిగింది. సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు సినిమాలతో డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న కళ్యాణ్ కృష్ణ కురసాల (Kalyan Krishna Kurusala)ఈ ప్రాజెక్టు డైరక్ట్ చేయటానికి సిట్టింగ్స్ జరిగాయి. అయితే కొద్దికాలం డిస్కషన్స్ జరిగాక తన స్దాయికి తగ్గ కథ కాదనుకోవటంతో దాన్ని ప్రక్కన పెట్టేసి విశ్వంభర చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఇప్పాడా కథ సందీప్ కిషన్ దగ్గరకు చేరిందని సమాచారం.
అదెలా సాధ్యం..చిరంజీవి వయస్సు ఎక్కడ, సందీప్ కిషన్ ఆ సినిమా ఎలా చేస్తారనుకుంటున్నారా..అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. చిరంజీవితో ఆ సినిమా అనుకున్నప్పుడు మరో యంగ్ హీరో పాత్ర కోసం సిద్దు జొన్నలగడ్డను అనుకున్నారు. ఇప్పుడు సిద్దు జొన్నలగడ్డ చేత అనుకుంటున్న పాత్రను సందీప్ కిషన్ చేత చేయించబోతున్నారు. అలాగే చిరంజీవి చేద్దామనుకున్న పాత్రను రావు రమేష్ వద్దకే వెళ్ళింది. ధమాకా డైరెక్టర్ త్రినాధరావు డైరెక్షన్లో ఈ సినిమా ఉంటుంది. అలాగే ఇక్కడ మరో ప్లాష్ బ్యాక్ ఉంది. ఈ కథను మొదట శ్రీవిష్ణు, రావు రమేష్ కోసం రాసుకున్నారు. అంతా ఓకే అనుకున్నాక రకరకాల కారణాలతో ఆ ప్రాజెక్టు పట్టాలు ఎక్కలేదు. ఆ తర్వాత అదే కథతో చిరంజీవిని ఒప్పించారు. కానీ అదీ సెట్ కాలేదు. ఇప్పుడు మళ్లీ రావు రమేష్, సందీప్ కిషన్ దగ్గరకు వచ్చి ఆగింది. అంటే రావు రమేష్ కు ఆ పాత్ర చేయాలని రాసి పెట్టి ఉందన్నమాట.
ఇక 'ధమాకా’ (Dhamaka) తర్వాత దర్శకుడు త్రినాథరావు నక్కిన (Trinadha Rao Nakkina)ఏ సినిమా డైరక్ట్ చేయలేదు. కొత్త సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే ఈ గ్యాప్‌లో ఆయన నిర్మాతగా మారి నక్కిన నెరేటివ్ అనే బ్యానర్ స్థాపించారు. కొత్తవారితో 'చౌర్యపాఠం’ అనే సినిమా నిర్మించారు.ఇప్పుడు ఆయన మళ్ళీ మెగాఫోన్ పట్టుకోవడానికి రెడీ అయ్యారు. ఇటీవల 'ఊరు పేరు భైరవకోన’ చిత్రంతో విజయం అందుకున్న సందీప్ కిషన్‌తో (Sundeep kishan) త్రినాధరావు ఓ సినిమా చేయబోతున్నారు. ఇదొక కమర్షియల్ ఎంటర్‌టైనర్ అని తెలుస్తోంది.
ఈ చిత్రానికి ‘ఓరి నాయనో ‘అనే పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. 'ధమాకా’కి మాస్ పాటలు ఇచ్చిన భీమ్స్ ఈ చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నారు. శ్యామ్ కె నాయుడు డీవోపీ. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్, సామజవరగమన తీసిన హాస్య మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.