
ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు, నిర్మాత వైవిఎస్ చౌదరి గురించిన ఓ వార్త ఫిల్మ్ నగర్లో సంచలనం అయింది. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆయన ఆత్మహత్యాయత్నం చేసినట్లు కొన్ని వెబ్ సైట్లు, సోషల్ మీడియాలో పుకార్లు షాకార్లు చేస్తున్నాయి. ఈ విషయం విని అటు అభిమానులు కూడా షాకయ్యారు. అసలు ఈ సంఘటన ఎప్పుడు జరిగింది? ఎలా జరిగింది? అనే విషయాలేవీ బయటకు రాలేదు. వైవిఎస్ చౌదరిగానీ, ఆయన కుటుంబ సభ్యులుగానీ ఈ విషయమై స్పందించేందుకు అందుబాటులో లేరు. దీంతో ఇది నిజమో? లేక పుకారో? తెలియక అయోమయం నెలకొంది.
ఎన్టీఆర్ వీరాభిమాని అయిన వైవిఎస్ చౌదరి ఆయన్ను చూసి ఇన్స్ పైర్ అయి తెలుగు సినిమా రంగం వైపు అడుగులు వేశారు. దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1998లో శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి సినిమాతో దర్శకుడిగా తెరంగ్రేటం చేసిన వైవిఎస్.... తొలి సినిమాతో మంచి విజయమే అందుకున్నారు. అనంతరం హరికృష్ణ, నాగార్జున లతో తీసిన సీతారామరాజు సక్సెస్ కావడంతో హిట్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. మహేష్ బాబుతో... అప్పట్లో మహేష్ బాబు రెండో సినిమా ‘యువరాజు' డైరెక్టర్ చేసే అవకాశం వైవిఎస్ చౌదరికి దక్కింది. అయితే ఈ చిత్రం పెద్ద విజయం సాధించక పోయినా మంచి ఫలితాలనే ఇచ్చింది.
లాహిరి లాహిరి లాహిరిలో చిత్రాన్ని స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కించిన చౌదరి ఈ చిత్రంతో మంచి విజయం అందుకుని నిర్మాతగా నిలదొక్కుకున్నారు. ఆ తర్వాత సీతయ్య, దేవదాసు చిత్రాలు కూడా సొంతగా నిర్మించి సక్సెస్ అయ్యారు.
అయితే 2008లో బాలయ్యతో తీసిన ‘ఒక్క మగాడు' సినిమా చౌదరికి భారీగా నష్టాలు మిగిల్చింది. ఆవెంటనే తన దర్శకత్వంలో మోహన్ బాబు నిర్మించిన ‘సలీమ్'కూడా పెద్ద ప్లాప్. ఈ రెండు పరాజయాలతో అటు అర్థికంగా నష్టపోవడం, ఇటు కెరీర్ పరంగా కిందకు పడిపోవడం జరిగింది.
దర్శకుడిగా అవకాశాలు లేక పోవడంతో 2015లో మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్ ను హీరోగా పరిచయం చేస్తూ తనే నిర్మాతగా ‘రేయ్' చిత్రాన్ని తీసిన చౌదరి మరింత ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు.
ఆర్థిక ఇబ్బందుల కారణంగానే వైవిఎస్ చౌదరి ఆత్మహత్యకు యత్నించారనే వార్తలు వ్యాపిస్తున్నాయి. అయితే.. సన్నిహితులు, కుటుంబ సభ్యులు మందలించి వారించారని, ప్రస్థుతం చౌదరి కోలుకుంటున్నారని సమాచారం.