పుస్తకంగా సైఫ్‌ అలీ ఖాన్‌ జీవితం.. విమర్శల వెల్లువ..!

By Aithagoni RajuFirst Published Aug 25, 2020, 2:03 PM IST
Highlights

ఓ రకంగా సైఫ్‌ కెరీర్‌ అంత విజయవంతంగా సాగడం లేదని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో సైఫ్‌ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన జీవితాన్ని పుస్తక రూపంలోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు.

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌కి ఇటీవల కాలంలో హీరోగా సక్సెస్‌లు లేవు. ఈ మధ్య ఆయన నటించిన `కాలాకాండి`, `బజార్‌`, `లాల్‌ కప్టన్‌`, `జవానీ జానేమన్‌` చిత్రాలు పరాజయం చెందాయి. ఇక అజయ్‌ దేవగన్‌ హీరోగా రూపొందిన `తానాజీ` చిత్రంలో విలన్‌గా నటించి మెప్పించాడు. 

ఓ రకంగా సైఫ్‌ కెరీర్‌ అంత విజయవంతంగా సాగడం లేదని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో సైఫ్‌ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన జీవితాన్ని పుస్తక రూపంలోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. తన ఆత్మకథని తానే స్వయంగా పుస్తక రూపంలోకి తీసుకురాబోతుండటం విశేష. ఆటోబయోగ్రఫీగా దీన్ని తీసుకురానున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ బాలీవుడ్‌ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ వెల్లడించారు. 

ఇందులో సైఫ్‌..తన కుటుంబం గురించి, ఇంటి విషయాలు, ఆయన జీవితంలోని విజయాలు, కెరీర్‌ పరంగా ఫెయిల్యూర్స్, ఆయన్ని ప్రభావితం చేసిన అంశాలు, ఆయన ప్రభావితం చేసిన విషయాలు, స్ఫూర్తి పొందడం, సినిమాల్లోని ఆటుపోట్లు.. మొత్తంగా అన్ని రకాల విషయాలను ఇందులో ప్రస్తావించనున్నట్టు తరణ్‌ తెలిపారు. ఈ పుస్తకాన్ని హర్పర్‌ కొల్లిస్‌ ఇండియా సంస్థ పబ్లిష్‌ చేయనుంది. ఇది వచ్చే ఏడాది మార్కెట్‌లోకి రానుందని తెలిపారు.

నవాబ్‌ కుటుంబానికి చెందిన సైఫ్‌ అలీ ఖాన్‌ చిన్నప్పట్నుంచి గోల్డెన్‌ స్ఫూన్‌లో పెరిగాడని చెప్పొచ్చు. 1993లో `పరంపర` చిత్రంతో బాలీవుడ్‌లోకి హీరోగా అడుగుపెట్టాడు. `ఆషిక్‌ అవారా`, `పెహల్‌ నషా`, `పెంచాన్‌`, `హమేషా`, `దిల్‌ చహతా హై`, `కచ్చె దాగే`, `హమ్‌ సాత్‌ సాస్‌ హై`, `క్యా కెహనా` వంటి విభిన్న కథా చిత్రాల్లో హీరోగా, సపోర్ట్ యాక్టర్‌గా నటించి మెప్పించారు. హీరోగానే కాదు, విలన్‌గానూ నటిస్తూ తనదైన నటనతో ఫిదా చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన `బంటీ ఔర్‌ బాబ్లి 2`, `భూట్‌ పోలీస్‌` చిత్రాల్లో నటిస్తున్నారు. 

ఇదిలా ఉంటే సైఫ్‌ తన జీవితంలో ఆటోబయోగ్రఫీ రాస్తున్నారని తరణ్‌ ఆదర్శ్‌ ప్రకటించగానే సోషల్‌ మీడియాలో కామెంట్స్ వెల్లు వెత్తుతున్నాయి. ఎక్కువగా ఆయనపై విమర్శలు వస్తున్నాయి. పుస్తకం రాసేంత గొప్ప పని సైఫ్‌ ఏం చేశారని, సినిమాల్లో ఆయన సాధించిన ఘనతలేంటి? ఏ రకంగా ఆయన జీవితం స్ఫూర్తిగా ఉంటుందనే కామెంట్స్ వస్తున్నాయి. ఇందులో తన కుటుంబం గొప్పతనం తప్ప మరేమీ ఉండదని, నెపోటిజానికి దగ్గరగా ఉంటుంద`నే విమర్శలు వస్తున్నాయి. 

click me!