
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలసి నటించిన తాజా చిత్రం భీమ్లా నాయక్. మలయాళంలో ఘనవిజయం సాధించిన అయ్యప్పన్ కోషియం చిత్రానికి ఇది రీమేక్ గా తెరకెక్కుతోంది. సాగర్ చంద్ర దర్శకుడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. మరికొద్దిరోజులోనే బాక్సాఫీస్ వద్ద భీమ్లా నాయక్ సందడి షురూ కానుంది.
సంక్రాంతికి రావలసిన ఈ చిత్రం వాయిదా పడింది. ఫిబ్రవరి 25న రిలీజ్ అంటూ ప్రకటించారు. అప్పుడైనా విడుదల అవుతుందా కాదా అనే అనుమానాల్ని పటాపంచలు చేస్తూ నిర్మాత నాగవంశీ అదే డేట్ ని ఖరారు చేశారు. భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25న బరిలోకి దిగబోతున్నాడు. దీనితో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.
పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అంటే సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిత్రం యుఎస్ లో కూడా భారీ ఎత్తున విడుదలకు సిద్ధం అవుతోంది. 400 పైగా థియేటర్స్ లో భీమ్లా నాయక్ చిత్రాన్ని యుఎస్ లో విడుదల చేస్తున్నారు.
సంగీత దర్శకుడు తమన్ ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. 'ఫుల్ ఫీస్ట్' అని కామెంట్ పెట్టాడు. ఇక ఓ ఇంటర్వ్యూలో తమన్ మాట్లాడుతూ.. భీమ్లా నాయక్ చిత్రంలో పవన్ కళ్యాణ్ అద్భుతంగా డ్యాన్స్ చేశారు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా పవన్ కళ్యాణ్ డ్యాన్సులకు కొంచెం దూరంగా ఉంటారు. అలాంటిది ఈ చిత్రంలో పవన్ డ్యాన్స్ చేసారు అని తమన్ చెప్పగానే అంచనాలు మరింత పెరిగాయి.
తానూ బిజియం ఇవ్వడం ఆపేసి మరీ పవన్ కళ్యాణ్ డ్యాన్స్ చూస్తూ ఉండిపోయాను అని తమన్ తెలిపాడు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కి జోడిగా నిత్యామీనన్, రానా సరసన సంయుక్త మీనన్ నటించారు.