
వర్కర్స్ ఫెడరేషన్ బంద్ పిలుపు
తెలుగు చిత్ర పరిశ్రమకి మరో పెద్ద సమస్య వచ్చింది. వర్కర్స్ ఫెడరేషన్ సభ్యులు సినిమా షూటింగ్స్ బంద్ కి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. చిత్ర పరిశ్రమకి చెందిన ఫెడరేషన్ లోని 24 కార్మిక సంఘాలు ఈ బంద్ లో పాల్గొనబోతున్నాయి. సినీ వర్కర్లకు 30 శాతం వేతనాలు పెంచాలనేది వారి ప్రధాన డిమాండ్. వేతనాలు పెంచాలని వర్కర్స్ ఫెడరేషన్ చాలా కాలంగా కోరుతోంది. ఈ మేరకు ఆదివారం రోజు ఫిలిం ఛాంబర్ తో వర్కర్స్ ఫెడరేషన్ సభ్యులు చర్చలు జరిపారు. ఈ చర్చలు విఫలం కావడంతో సినిమా షూటింగ్స్ బంద్ కి పిలుపునిచ్చారు.
ఫిలిం ఛాంబర్ సంచలన రియాక్షన్
వర్కర్స్ ఫెడరేషన్ బంద్ నిర్ణయంపై ఫిలిం ఛాంబర్ తాజాగా ఘాటుగా స్పందించింది. తాము కూడా తగ్గేదే లే అన్నట్లుగా ప్రకటన విడుదల చేశారు. దీనితో ఈ సమస్య మరింత ముదిరినట్లు అనిపిస్తోంది. నిర్మాతలు ఎవరూ కూడా ఫెడరేషన్ సభ్యులకు అనుకూలంగా స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవద్దని, ఫిలిం ఛాంబర్ ఆదేశాలు మాత్రమే పాటించాలని లెటర్ రిలీజ్ చేశారు. ఈ లేఖలో ఫిలిం ఛాంబర్ ఈ విధంగా పేర్కొంది.
''ప్రియమైన నిర్మాతలకు,
ఫెడరేషన్ పక్షపాతంగా 30 శాతం వేతనాల పెంపును డిమాండ్ చేస్తోంది. ప్రస్తుత చట్టాల ప్రకారం నైపుణ్యం ఉన్నవారికి, లేని వారికి కనీస వేతనాల కంటే ఎంతో ఎక్కువ చెల్లిస్తున్నాం. ఫెడరేషన్ బంద్ వల్ల నిర్మాణంలో ఉన్న చిత్రాలకు భారీ నష్టాన్ని కలిగిస్తుంది.
చాలా దశాబ్దాలుగా ఫెడరేషన్ సభ్యులతో కలసి పనిచేస్తున్న మనం వారి నిర్ణయాన్ని ఖండిస్తున్నాం. ఈ సమస్య పరిష్కారం కోసం ఛాంబర్ సంబంధింత అధికారులతో చర్చలు జరుపుతోంది. నిర్మాతలు ఎలాంటి స్వతంత్ర చర్యలు లేదా సంఘాలతో ప్రత్యేక ఒప్పందాలు చేసుకోకుండా ఛాంబర్ జారీ చేసే దిశా నిర్దేశాలని ఖచ్చితంగా అనుసరించాలని తెలియజేస్తున్నాం. శాశ్వత పరిష్కారం, మెరుగైన భవిష్యత్తు కోసం మనమంతా ఐక్యతతో ఉండాలి'' అంటూ ఫిలిం ఛాంబర్ లేఖలో పేర్కొంది.
నిర్మాత ఎస్కేఎన్ ఆవేదన
వర్కర్స్ పెడరేషన్ వేతనాల పెంపు డిమాండ్ కి చిత్ర పరిశ్రమ పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నట్లు ఛాంబర్ రియాక్షన్ తో అర్థం అవుతోంది. ఈ వివాదం ఎంత దూరం వెళుతుందో అని చిత్ర వర్గాలు టెన్షన్ పడుతున్నాయి. ఈ వివాదంపై బేబీ చిత్ర నిర్మాత ఎస్కేఎన్ ఆసక్తికరంగా స్పందించారు. సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేస్తూ.. ఇప్పటికే ఆడియన్స్ థియేటర్స్ కి దూరం, ఇప్పుడు అదనపు వేతనాల భారం, ఓటీటీ శాటిలైట్స్ అగమ్యగోచరం, పైరసీ పుండుమీద కారం, పేరుకే వినోద పరిశ్రమ నిర్మాతల శ్రమ విషాదమే అని కామెంట్స్ చేశారు.