
మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆదివారం సాయంత్రం జూబ్లిహిల్స్ లోని ఆయన నివాసంలో సీఎంని మర్యాదపూర్వకంగా కలిశారు చిరంజీవి. ఈ సందర్భంగా చిరంజీవికి పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సత్కరించారు రేవంత్ రెడ్డి. వీరిద్దరి మధ్య కాసేపు వ్యక్తిగత విషయాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. అదే సమయంలో సడెన్‌గా సీఎంని చిరంజీవి కలవడం ఆసక్తికరంగా మారింది.
తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంప్లాయిస్ ఫెడరేషన్(24 క్రాఫ్ట్ లకు సంబంధించిన యూనియన్) షూటింగ్‌లు బంద్‌కి పిలుపునిచ్చారు. తమకు 30శాతం వేతనాలు పెంచాలని ఫెడరేషన్ డిమాండ్ చేస్తోంది. కానీ ఫిల్మ్ ఛాంబర్ ఒప్పుకోవడం లేదు. వీరి మధ్య ఆదివారం ఫిల్మ్ ఛాంబర్‌లో చర్చలు జరగ్గా, అవి విఫలమయ్యాయి. దీంతో ఫిల్మ్ ఫెడరేషన్ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. 30శాతం వేతనాలు పెంచుతూ లెటర్ ఇచ్చిన నిర్మాతల సినిమాల షూటింగ్‌లకు మాత్రమే సినీ కార్మికులు హాజరవుతారని, అలా లెటర్ ఇవ్వని వారి షూటింగ్‌లకు కార్మికులు వెళ్లకూడదని స్పష్టం చేసింది. టాలీవుడ్‌లో ఈ కీలక నిర్ణయం జరిగిన తరుణంలో సీఎంని మెగాస్టార్ చిరంజీవి కలవడం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ ఫెడరేషన్ నిర్ణయానికి, సీఎంని చిరు కలవడానికి సంబంధం లేదని తెలుస్తోంది.
రేవంత్‌రెడ్డిని చిరంజీవి కలవడానికి స్పష్టమైన కారణాలు బయటకు రాకపోవడంతో ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ నెల(ఆగస్ట్) 22న మెగాస్టార్ పుట్టిన రోజు. ఆయన 70వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా భారీ ఈవెంట్ ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? లేక ఏదైనా స్పెషల్ ప్లాన్ చేశారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా సీఎంని చిరంజీవి సడెన్‌గా కలవడం ఇండస్ట్రీలో, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.
ఇదిలా ఉంటే మెగాస్టార్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన వశిష్ట దర్శకత్వంలో `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన సాంగ్ షూటింగ్ ఇటీవలే జరిగింది. దీనితో కొంత ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ మొత్తం పూర్తయినట్టు సమాచారం. ప్రస్తుతం వీఎఫ్‌ఎక్స్ పై వర్క్ జరుగుతోంది. దీనిపై క్లారిటీ వచ్చాక రిలీజ్ డేట్‌ని ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఏడాది ఎండింగ్‌లో ఈ సినిమాని విడుదల చేసే అవకాశం ఉంది. ఇంకోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో `మెగా157` పేరుతో మరో సినిమా చేస్తున్నారు చిరంజీవి. నయనతార హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీ చిరు మార్క్ వింటేజ్ యాక్షన్, అనిల్ మార్క్ వినోదం మేళవింపుగా ఉండబోతుందట. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నట్టు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది.