
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి షూటింగ్‌లు బంద్‌కు పిలుపునిచ్చింది. 24 కార్మిక సంఘాలు ఈ బంద్‌లో పాల్గొనబోతున్నాయి. ఈ విషయాన్ని ఫెడరేషన్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ బంద్‌కి సంబంధించిన కొన్ని కండీషన్స్ ఉన్నాయి. కార్మికులకు 30శాతం వేతనాలు పెంచాలని సినీ కార్మిక సంఘాలు, ఫెడరేషన్ డిమాండ్ చేస్తూ వచ్చింది. ఆదివారం(ఆగస్ట్ 3న) హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ పెద్దలతో కార్మిక సంఘాల నాయకులు చర్చలు జరగ్గా, ఈ చర్చలు విఫలమయ్యాయి. ఫిల్మ్ ఛాంబర్.. ఫెడరేషన్ డిమాండ్‌ని ఒప్పుకోలేదు. దీంతో ఫెడరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది.
రేపటి (ఆగస్ట్ 4) నుంచి 30 శాతం వేతనాలు పెంచి ఇస్తామని తెలిపిన నిర్మాతల సినిమాల షూటింగ్‌లకి మాత్రమే 24 క్రాఫ్ట్ ల కార్మికులు వెళ్లాల్సి ఉంటుంది. ఈ మేరకు నిర్మాతల నుంచి ఫెడరేషన్‌కు లెటర్ ఇచ్చిన వారి సినిమాలు షూటింగ్‌లకు మాత్రమే కార్మికులు హాజరు కావాల్సి ఉంటుంది. అలాంటి లెటర్ ఇవ్వని నిర్మాతల సినిమాల షూటింగ్‌లకు వెళ్లకూడదని ఫెడరేషన్ స్పష్టం చేసింది.
ఈ మేరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధికారికంగా లెటర్‌ని విడుదల చేసింది. ఈ ఆదివారం జరిగిన ఫెడరేషన్ సర్వసభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడిస్తూ,
1. వేతనాలు పెంపు విషయంలో కో ఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్‌లుగా సయ్యర్ హ్యూమయున్, దర్శకుడు వీరశంకర్‌లను నియమించాం.
2. రేపటి నుంచి(తేదీః 4-8-2025) 30శాతం వేతనాలు పెంచి ఇవ్వాలని నిర్ణయించడమైనది.
3. రేపు(సోమవారం-4-8-2025) ఉదయం నుంచి 30శాతం వేతనాలు ఇస్తామని ప్రొడ్యూసర్ నుంచి సంబంధిత కన్ఫర్మేషన్ లెటర్ ఇచ్చిన వారికి మాత్రమే, సంబంధిత లెటర్ ఫెడరేషన్ ద్వారా యూనియన్‌లకు తెలియజేసిన తర్వాత మాత్రమే విధులకు(షూటింగ్‌లకు) వెళ్లాలని నిర్ణయించడమైనది.
4. అప్పటి వరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కు సంబంధించిన సభ్యులు ఎవరు కూడా సినిమాకుగాని, వెబ్ సిరీస్‌ల షూటింగ్‌లకుగాని, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నుంచి అనుమతి లేనిదే ఎలాంటి విధులకు యూనియన్, అసోసియేషన్ సభ్యులు హాజరు కాకూడదని నిర్ణయించడమైనది. ఈ రూల్స్ తెలుగు సినిమా షూటింగ్ ఎక్కడ జరిగినా వర్తించును. ఇతర భాషా చిత్రాలకు కూడా వర్తించును` అని పేర్కొంది ఫెడరేషన్.
ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని, ప్రధాన కార్యదర్శి అమ్మిరాజు కానుమిల్లి, కోశాధికారి టీవీ అలెగ్జాండర్ పేర్లతో ఈ లెటర్ ఆదివారం విడుదలైంది. ఫెడరేషన్ నిర్ణయం ప్రకారం 30శాతం వేతనాలు పెంపు ఇవ్వని నిర్మాతల షూటింగ్‌లు రేపటి నుంచి ఆగిపోబోతున్నాయని చెప్పొచ్చు.