
తెలుగు చలనచచిత్ర పరిశ్రమలో పెద్ద దిక్కుగా వ్యవహరించిన దాసరి ఇకలేరు. ఆయన మరణించి అప్పుడే.. వారం గడిచిపోయిందా అనిపిస్తోంది. బతికున్నప్పుడు దాసరి అంటే గురువు గారు,, దాసరి అంటే పెద్ద దిక్కు.. దాసరి అంటే ఆపన్న హస్తం.. కానీ ఆయన చనిపోయారు. తెలుగు సినిమా పరిశ్రమలో దశాబ్దాల తరబడి సుదీర్ఘ అనుభవం కలిగిన వ్యక్తి. ఎంతో మందికి అన్నం పెట్టిన మహా మనిషి. ఒక రచయితగా.. నటుడుగా.. నిర్మాతగా, డిస్ర్టిబ్యూటర్ గా, ఎగ్జిబిటర్ గా తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధిలో నేనుసైతం అంటూ కీలక పాత్ర పోషించిన దాసరి ‘నేను అందరివాడిని’ అని చాలా సార్లు చెప్పుకున్నారు. బహుషా ఈ కారణంగానే దాసరి గతించి వారం గడిచినా ఆయన సంతాప సభ పెట్టే తీరిక, ఓపిక ఏ సినిమా సంఘానికి ఉన్నట్లు లేదు.
పరిశ్రమలో ఎవరికి ఏ సమస్య వచ్చినా, పరిశ్రమకి ఏ సంక్షోభం వచ్చినా అందరికీ గుర్తొచ్చేది ‘గురువుగారు’. సమస్య ఏదైనా.. ఆయా అసోసియేషన్ల ప్రతినిధులు ‘ఒకసారి గురువుగారితోనూ చర్చించి, నిర్ణయం తీసుకుంటాం’ అని చెప్తుంటారు. దాసరి అనే వృక్షం నీడన తలదాచుకుని ఎదిగిన వాళ్లు.., చిన్నా, పెద్ద తేడా లేకుండా ‘సమస్య’ అనగానే దాసరి పాదాలపై వాలిన వాళ్లు పెద్ద దిక్కు చనిపోతే.. తాము ఎలాగూ ఎదిగారు కనుక ఇక పని లేదనుకుని కడసారిగా గురువుగారిని సాగనంపలేకపోయారా?
‘‘దాసరిగారు చనిపోయినప్పుడు సినీ ప్రముఖులు చాలా వరకు ఇక్కడ లేరు. అందరూ నాతో ఫోనుల్లో మాట్లాడారు. సంతాప సభను భారీగా నిర్వహిద్దామని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులు దశదిన కర్మను నిర్వహిస్తున్న ప్రాంగణంలోనే ఈ సంతాప సభను కూడా నిర్వహిస్తాం. ఈ నెల 11న ఇమేజ్ గార్డెన్స్‌లో జరిగే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనాలు హాజరవుతారు. వారందరి సమక్షంలో ఈ సంతాప సభను నిర్వహిస్తాం.” అని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు సి.కళ్యాణ్ తెలిపారు.
సంతాప సభలకు హాజరయ్యే వారి సంఖ్య తగ్గిపోయింది. ఆ మధ్య కూడా ఒకట్రెండు సంతాప సభలను నిర్వహించి అభాసుపాలయ్యాం. పరిశ్రమలో స్వార్థం పాళ్లు పెరుగుతున్నాయి... దాసరిగారి అంతిమ సంస్కారానికి ఆయన పరిచయం చేసిన వారే గైర్హాజరయ్యారు. ఈ విష సంస్కృతికి చరమగీతం పాడాలి? నాకేంటనే ఆలోచనా ధోరణిని పక్కనపెట్టాలని ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా అన్నారు.
మరోవైపు 30న పరమపదించిన దర్శకరత్న దాసరి నారాయణరావు పెదకర్మ జూన్ 11న నిర్వహించనున్నట్లు ఆయన సోదరుడు వెంకటేశ్వరరావు, దాసరి కుమారులు ప్రభు, అరుణ్‌కుమార్, అల్లుడు రఘునాథ్‌బాబు ప్రకటించారు. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో హైదరాబాద్‌లోని మాదాపూర్ ఇమేజ్ గార్డెన్స్ లో ఈ కార్యక్రమం జరగనుందని వారు తెలిపారు. ఇదే సందర్భంగా సినీ పరిశ్రమ తరపున కూడా సభ నిర్వహించాలని భావిస్తున్నట్లు నిర్మాతల మండలి అధ్యక్షుడు బూరుగుపల్లి తెలిపారు.
దాసరి లాంటి ఒక మహామనిషి కోసం పట్టుమని పది నిమిషాలు కేటాయించలేనంత బిజీగా మన సినీ పరిశ్రమ జనాలున్నారని అర్థమవుతోంది. ఇప్పటికైనా పరిశ్రమ దర్శకరత్నను సగౌరవంగా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది.