
ప్రియాంక చోప్రా హిరోయిన్ గా.. ప్రముఖ టాలీవుడ్ దర్శకులు ఎ.యస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో 60 కోట్ల రూపాయల బడ్జెట్ తో బాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమా రూపొందనుంది. ఓ అగ్ర నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
టాలీవుడ్ లో యజ్ఞం, వీరభద్ర లాంటి చిత్రాల తర్వాత కొంత గ్యాప్ తో తిరిగి 2014లో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, రెజినా హీరోహిరోయిన్లుగా పిల్లా నువ్వు లేని జీవితం చిత్రంతో బాక్సాఫీస్ వద్ద హిట్ డైరెక్టర్ గా క్రేజ్ సంపాదించాడు రవికుమార్ చౌదరి. పిల్లా నువ్వులేని జీవితం సక్సెస్ తర్వాత గోపీచంద్, రెజీనా జంటగా తెరకెక్కించిన సౌఖ్యం కూడా మంచి టాక్ తెచ్చుకుంది.
సౌఖ్యం తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకున్న రవికుమార్ చౌదరి తిరిగి బాలీవుడ్ లో ప్రియాంక చోప్రాతో లేటెస్ట్ గా కొత్త సినిమాకు శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ బాలీవుడ్ చిత్రంలో ప్రియాంకచోప్రా లీడ్ రోల్ చేయనుంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కబోతున్న ఈ మూవీ ఓ విభిన్న కథాంశంతో తెరకెక్కనుందని తెలుస్తోంది.
హాలీవుడ్ లో విజయవంతమైన ఒక సినిమాకి ఇది రీమేక్. ఈ సినిమాతో రవి కుమార్ చౌదరి బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు. జాతీయ స్థాయిలో అందర్నీ ఆకట్టుకునేలా వైడ్ స్కోప్ ఉన్న ఈ సినిమా కి ఎడిటర్: గౌతమ్ రాజు, ఫైట్స్:వెంకట్, సంగీతం:గోపీ సుందర్. ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. మొత్తానికి మరో తెలుగు దర్శకుడు బాలీవుడ్ సినిమాను డైరెక్ట్ చేయడం గమనార్హం.
ఈ మూవీతో పాటు నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రవికుమార్ చౌదరి దర్శకత్వంలో త్వరలోనే ఓ మూవీ పట్టాలెక్కనుందని సమాచారం. అనంతరం బాలకృష్ణ హీరోగా రవికుమార్ చౌదరి దర్శకత్వంలో మరో చిత్రం తెరకెక్కనుందని తెలుస్తోంది. బాలకృష్ణపై తన అభిమానాన్ని మెగా హీరో మూవీ ఆడియో వేడుకలోనే చాటి రవికుమార్ చౌదరి సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.