
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలసి నటించిన తాజా చిత్రం భీమ్లా నాయక్. మలయాళంలో ఘన విజయం సాధించిన అయ్యప్పన్ కోషియం చిత్రానికి ఇది రీమేక్ గా తెరకెక్కుతోంది. సాగర్ చంద్ర దర్శకుడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ శుక్రవారమే బాక్సాఫీస్ పై దండయాత్రకు భీమ్లా నాయక్ సిద్ధం అవుతున్నాడు.
ఫిబ్రవరి 25న భీమ్లా నాయక్ గ్రాండ్ రిలీజ్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నేడు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరగనుంది. ఇటువంటి తరుణంలో భీమ్లా నాయక్ చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. తెలంగాణలో ఈ చిత్ర ఐదవ షోకి అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఫిబ్రవరి 25 నుంచి మార్చి 11 వరకు అదనంగా ఐదవ షో ప్రదర్శించుకునే వెసులుబాటు కల్పించింది. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో చిత్రానికి తొలి వారంలో భారీ డిమాండ్ ఉంటుంది. దీనితో ఐదవ షో వల్ల వసూళ్లు తప్పకుండా పెరుగుతాయి. ఏపీలో టికెట్ ధరల సమస్య ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో భీమ్లా నాయక్ నిర్మాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందనే చెప్పాలి.
ఇదిలా ఉండగా నేడు జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తెలంగాణ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. అలాగే సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పెషల్ గెస్ట్ గా హాజరు కానున్నారు. తెలంగాణ ప్రభుత్వం చిత్ర పరిశ్రమకు వరాల జల్లులు కురిపిస్తోంది. ఇప్పటికే టికెట్ల ధర పెంపుకు అనుమతి ఇవ్వగా.. తాజాగా ఐదవ షోకి అనుమతి ఇవ్వడం విశేషం.
ఇక నేడు జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్, కేటీఆర్ ఒకే వేదికపై కనిపించనుండడం ఆసక్తిగా మారింది. ఇద్దరూ కలసి ఏం మాట్లాడబోతున్నారు అనేది కూడా పొలిటికల్ సర్కిల్స్ లో ఉత్కంఠగా మారింది.