
ప్రజా కవి, సినిమా పాటల రచయిత, తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ రాసిన అందె శ్రీ(64) ఇక లేరు. ఆయన సోమవారం ఉదయం కన్నుమూశారు. ఆదివారం ఇంట్లో అస్వస్థతకు గురైన ఆయన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. అందెశ్రీ మృతి పట్ల తెలంగాణ సమాజం తీవ్రం దిగ్భ్రాంతికి గురయ్యింది. ఆయన మరణం తెలంగాణ సాహిత్యానికి, తెలంగాణ పాటకి తీరని లోటని, పలువురు రచయితలు, తెలంగాణ వాదులు కొనియాడుతూ, సంతాపం తెలియజేస్తున్నారు.
అందెశ్రీ అనేక విప్లవాత్మక, అభ్యుదయ పాటలను రాశారు. తెలంగాణ కవిగా పాపులర్ అయ్యారు. తెలంగాణ రచనకు సంబంధించి విశేష సేవలందించారు. 2006లో `గంగ` అనే సినిమాకి గానూ నంది అవార్డుని అందుకున్నారు. వీటితోపాటు 2014లో అకాడమి ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీల్ డాక్టరేట్‌ని పొందారు. 2015లో దాశరథి సాహితి పురస్కారం దక్కించుకున్నారు. అలాగే అదే ఏడాది రావూరి భరద్వాజ సాహితి పురస్కారం దక్కింది. ఆర్ నారాయణ మూర్తి తీసిన అనేక చిత్రాలకు అందెశ్రీ పాటలు రాయడం విశేషం. తన పాటలతో ప్రజలను చైతన్యం చేయడంలో అందె శ్రీది పైచేయి చెప్పొచ్చు. తెలంగాణ ఉద్యమంలోనూ ఆయన పాటలు ఉర్రూతలూగించాయి. ఉద్యమం సక్సెస్ కావడంతో ఆయన పాటలు కీలక పాత్ర పోషించాయి.
ప్రజాకవిగా, ప్రకృతికవిగా, అభ్యూదయ రచయితగా సుప్రసిద్ధులైన అందెశ్రీ వరంగల్ జిల్లా జనగామ వద్ద గల రేబర్తి అనే గ్రామంలో 18 జూలై,1961 జన్మించారు. ఈయన అసలు పేరు అందె ఎల్లయ్య. ఒక అనాధగా పెరిగారు. పెద్దగా చదువు లేదు. కాయకష్టం చేస్తూ తన పనిలోనే సాహిత్యాన్ని వెతుక్కున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందారు. మొదట్లో అందెశ్రీ గొర్రెల కాపరిగా పని చేశారు. అందెశ్రీ పాటలు పాడటం శృంగేరి మఠానికి సంబంధించిన స్వామీ శంకర్ మహారాజ్ విని చేరదీసాడు. ఆయన ప్రోత్సాహంతో గొప్ప కవిగా, రచయితగా ఎదిగారు. రాష్ట్రవ్యాప్తంగా ఈయన పాటలు బాగా పాపులర్ అయ్యాయి.
ఆర్ నారాయణ మూర్తి ద్వారా వచ్చిన విప్లవాత్మక సినిమాల విజయం వెనుక ఈ పాటలున్నాయి. ఎంతో పాపులర్ పాటలను అందెశ్రీ రాసినవే. తెలంగాణ, ప్రకృతి లాంటి అంశాలపై ఆయన గేయరచన చేశారు. `ఎర్ర సముద్రం` సినిమా కోసం రచించిన `మాయమైపోతుండమ్మా మనిషన్నవాడు` ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాల తెలుగు విషయం రెండో సంవత్సరం సిలబస్ లో చేర్చారు. కాకతీయ విశ్వవిద్యాలయం ఈయనకు గౌరవ డాక్టరేట్ అందించింది. అంతేకాదు `బతుకమ్మ` సినిమా కోసం డైలాగ్స్ కూడా రాశారు.
`జయజయహే తెలంగాణ జననీ జయకేతనం (తెలంగాణ గీతం)`, `పల్లెనీకు వందనములమ్మో`, `మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు`, `గలగల గజ్జెలబండి`, `కొమ్మ చెక్కితే బొమ్మరా... కొలిచి మొక్కితే అమ్మరా`, `జన జాతరలో మన గీతం`, `యెల్లిపోతున్నావా తల్లి, `చూడ చక్కని తల్లి` వంటి పాటలు బాగా పాపులర్ అయ్యాయి. వీటితోపాటు అనేక పాటలను ఆయన రాశారు. అలాగే రైటర్‌గా ఆయన అనేక పురస్కారాలు సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కోటి నగదు పురస్కారం అందుకున్నారు. అందెశ్రీ మరణం తెలంగాణ సాహిత్యానికి తీరని లోటని చెప్పొచ్చు.