కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణం చిత్ర పరిశ్రమలో, రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. జూబ్లీహిల్స్‌లోని కృష్ణంరాజు నివాసంలో ఆయన భౌతికకాయానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు.
కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణం చిత్ర పరిశ్రమలో, రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. జూబ్లీహిల్స్‌లోని కృష్ణంరాజు నివాసంలో ఆయన భౌతికకాయానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా కృష్ణంరాజు భౌతికకాయానికి నివాళులర్పించారు. కృష్ణంరాజు భౌతికకాయానికి కృష్ణ నివాళులర్పిస్తున్న సమయంలో అక్కడికి చేరుకన్న చంద్రబాబు.. కృష్ణను పలకరించారు. కృష్ణంరాజు భౌతికకాయానికి నివాళులర్పించిన చంద్రబాబు.. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, సానుభూతి తెలియజేశారు. అక్కడే కొన్ని నిమిషాల పాటు కూర్చొన్న చంద్రబాబు.. ప్రభాస్‌ను పరామర్శించారు.
అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. కృష్ణంరాజు మరణం బాధ కలిగించిందన్నారు. ఆయనకు చరిత్రలో స్థానం ఉంటుందన్నారు. సినీ పరిశ్రమలో విభిన్నమైన పాత్రల్లో రాణించారని అన్నారు. ప్రజలకు సేవలకు రాజకీయాల్లోకి వచ్చారని.. ఎంపీగా, కేంద్ర మంత్రిగా సేవలు అందించారని గుర్తుచేశారు. సినిమాల్లో, రాజకీయాల్లో ఆయనకంటూ ప్రత్యేక స్థానం ఉందన్నారు. సినీ పరిశ్రమ ఒక పెద్ద దిక్కును కోల్పోయిందన్నారు. ఆయన గతంలో అపోలో ఆస్పత్రిలో ఉన్న సమయంలో తాను కొంతసేపు మాట్లాడినట్టుగా గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ప్రముఖ నటులు కృష్ణంరాజు గారి అంతిమ దర్శనం కోసం ఆయన నివాసానికి వెళ్ళి ఆయన భౌతిక దేహానికి నివాళులర్పించాను. కృష్ణంరాజుగారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పాను. ఈ బాధ నుండి కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నాను. pic.twitter.com/1BzvdVa5Gk
— N Chandrababu Naidu (@ncbn)Also Read: అధికార లాంఛనాలతో కృష్ణంరాజు అంత్యక్రియలు.. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశం..
ప్రభాస్ ఉన్నతమైన స్థానంలో ఉండాలని కృష్ణంరాజు ఎప్పుడూ ఆశించేవారని చంద్రబాబు చెప్పారు. కృష్ణంరాజు లేని లోటు తీర్చలేనిది అయినప్పటికీ.. ప్రభాస్ ధైర్యంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
Also Read: కృష్ణంరాజు మరణం కలచివేసింది: కుటుంబ సభ్యులకు ప్రధాని మోదీ సానుభూతి
ఇక, కృష్ణంరాజు భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఉంచనున్నారు. రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు మహాప్రస్థానంలో కృష్ణంరాజు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టుగా ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక, కృష్ణంరాజు అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ను కేసీఆర్ ఆదేశించారు. దీంతో కృష్ణంరాజు అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించేందుకు సోమేష్ కుమార్ ఏర్పాట్లు చేయనున్నారు.