
తారకరత్న మరణం ఊహించని విషాదం. చిన్న వయసులో మృత్యు ఒడిలో చేరిన తారకరత్న ఉదంతం ప్రతి ఒక్కరినీ కలచి వేస్తుంది. చిత్ర ప్రముఖులు ఆయన మృతికి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు. పలువురు టాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు తారకరత్న పార్థివ దేహాన్ని సందర్శించారు. ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.
తారకరత్న హీరోగా నటించిన చిత్ర విడుదల కొద్దిరోజుల్లో ఉండగా ఆయన మరణించడం కలచి వేస్తుంది. 'మిస్టర్ తారక్' టైటిల్ తో తారకరత్న క్రైమ్ థ్రిల్లర్ చేశారు. ఈ చిత్రం ఫిబ్రవరి 24న విడుదల చేయాలని భావిస్తున్నారు. ట్రైలర్ కూడా విడుదల చేశారు. అయితే మిస్టర్ తారక్ విడుదలకు వారం రోజుల ముందు తారకరత్న కన్నుమూశారు. ఈ క్రమంలో మిస్టర్ తారక్ చిత్ర విడుదల వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు తెలియజేశారు
మిస్టర్ తారక్ మూవీలో భార్య, ప్రాణమిత్రుడు చేతిలో మోసపోయిన వ్యక్తిగా తారకరత్న కనిపించనున్నారు. మిస్టర్ తారక్ ట్రైలర్ ఆకట్టుకున్న నేపథ్యంలో సినిమా మీద అంచనాలు ఏర్పడ్డాయి. మిస్టర్ తారక్ మూవీ ఆయనకు బ్రేక్ ఇస్తుందని ఫ్యాన్స్ భావించారు. ఇంతలో ఈ విషాదం చోటు చేసుకుంది.
తారకరత్న జనవరి 27న అస్వస్థతకు గురయ్యారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర కుప్పం నియోజకవర్గం వేదిక ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ, తారకరత్న హాజరయ్యారు. పాదయాత్ర మొదలైన కాసేపటికి తారకరత్న జనాల్లో కుప్పకూలిపోయారు. ఆయన్ని స్థానిక ఆస్పత్రికి చేర్చారు. తారకరత్న కార్డియాక్ అరెస్ట్ కి గురైనట్లు తెలుసుకున్న వైద్యులు మెరుగైన వైద్యం కోసం బెంగుళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు.
గత 23 రోజులుగా ఆయనకు ఐసీయూలో చికిత్స జరుగుతుంది. కార్డియాక్ అరెస్ట్ కి గురయ్యాక మెదడుకు రక్త ప్రసరణ అందలేదు. ఈ కారణంగా మెదడులో పై భాగం దెబ్బతింది. న్యూరో స్పెషలిస్ట్స్ ఎంత ప్రయత్నం చేసినా ఆయన మెదడు సాధారణ స్థితికి రాలేదు. దీంతో ఆయన కోమాలోనే కన్నుమూశారు. నేడు హైదరాబాద్ లో ఆయన అంత్యక్రియలు పూర్తి చేస్తున్నారు.