
నటుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఆయన గత 22 రోజులుగా బెంగుళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అప్పట్లో విషమంగానే తారకరత్న ఆరోగ్యం ఉందన్నారు. ఆ తర్వాత కాస్త నిలకడగా ఉందని, కొంత మెరుగుపడుతుందని కుటుంబ సభ్యులు చెబుతూ వస్తున్నారు. అయితే ఇప్పుడు మరోసారి ఆయన ఆరోగ్యం విషమించిందని వైద్యులు తెలిపారు. దీంతో శనివారం మధ్యాహ్నం బాలకృష్ణతోపాటు వారి కుటుంబ సభ్యులు హుటాహుటిన బెంగుళూరుకి చేరుకున్నారు.
ఇదిలా ఉంటే తారకరత్నని హైదరాబాద్‌కి తరలించే అవకావం ఉందట. ప్రస్తుతం దీనికి సంబంధించి వైద్యులు, కుటుంబ సభ్యుల మధ్య చర్చలు జరుగుతున్నాయట. తారకరత్నని హైదరాబాద్ కి తరలించేందుకు స్థానిక పోలీసులు కాన్వాయ్‌ని కూడా సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఏపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ సైతం ఈ విషయాన్ని తెలియజేశారు. ఆయన శనివారం సాయంత్రం బెంగుళూరులోని నారాయణ హృదయాలయలో తారకరత్నని పరామర్శించారు. అనంతరం వెళ్తూ మీడియాతో స్పందించారు. ఆరోగ్యం ఇంకా అలానే ఉందని, హైదరాబాద్‌కి తరలించే విషయంపై చర్చలు జరుపుతున్నారని తెలిపారు.
గురువారం తారకరత్నకి ఎంఆర్‌ఐ స్కానింగ్ చేశారు వైద్యులు. రిపోర్ట్ లను బట్టి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. మెదడుకు సంబంధించి వైద్య సేవల కొనసాగిస్తున్నట్టు వెల్లడించారు. అయితే ఇప్పుడు శనివారం అనూహ్యంగా తారకరత్న ఆరోగ్యం క్షిణించిందని, అత్యంత విషమంగా మారిందని వైద్యులు తెలియజేయడం గమనార్హం. గత నెల 27న నారాలోకేష్ ప్రారంభించిన పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. ఆ సమయంలోనే ఆయన గుండెపోటుకు గురయ్యారు. వెంటనే స్థానంగా కుప్పం ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వ్యైద్యం కోసం ఆయన్ని నెక్ట్స్ డే బెంగుళూరులోని నారాయణ హృదయాలయకు తరలించిన విషయం తెలిసిందే. మెరుగైన వైద్యం కోసం విదేశాల నుంచి వైద్యులను పిలిపించి మరీ చికిత్స అందించారు. కానీ ఆయన ఆరోగ్యం ఏమాత్రం మెరుగపడటం లేదని తెలుస్తుంది.