నాగార్జున కి చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వివాదం పెద్ద దుమారమే రేపుతుంది. ఈ నేపథ్యంలో సీఎం, మాజీ సీఎం, మంత్రులపై తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు.
నాగార్జునకి చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ని హైడ్రా(హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) అధికారులు కూల్చేసిన విషయం తెలిసిందే. తుమ్మిడికుంట చెరువుని ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని అధికారులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఎన్ని ఒత్తిడిలు వచ్చినా ఈ విషయంలో తగ్గేదెలే అని తేల్చి చెప్పాడు. ఇలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టిన ఎవరినీ వదిలిపెట్టబోమని ఆయన చెప్పారు.
ఈ నేపథ్యంలో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వివాదం ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారింది. రాజకీయ నాయకులు సైతం దీనిపై స్పందించడంతో పెద్ద దుమారం రేపుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి హాట్ కామెంట్ చేశారు. కూల్చడం స్టార్ట్ చేస్తే సగం హైదరాబాద్‌ని కూల్చేయాలని తెలిపారు.
`నాకు తెలిసినంత వరకు నాగార్జున ఆ ల్యాండ్‌ని కొనుక్కున్నాడు. చెరువు సైడ్ ఉన్న మూడెకరాలు కబ్జా అని, దాన్ని కూల్చామంటున్నారు. అందులో నిజమెంతా అనేది తెలియదు. కానీ చెరువు ఒడ్డున్న ఉన్న ల్యాండ్‌ని కొంత వదిలేసి నిర్మాణాలు చేపట్టాల్సింది. అది నాగార్జున ల్యాంఢ్ అయినా ఒడ్డునే అనుకుని కట్టకూడదు. అదంతా వాటర్ బాడీ కాబట్టి. ఈ సందర్భంగా నాకు అర్థం కాని విషయమేంటంటే.. ఓన్లీ ఎఫ్‌టీఎల్(ఫుల్ ట్యాంక్ లెవల్-చెరువు) పరిధిలో ఉన్న నిర్మాణాలనే కూల్చేస్తున్నారా? లేక పర్మిషన్స్ లేకుండా నిర్మించిన ఇళ్లని కూలుస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది.
ఇటీవల చిత్రపూరి కాలనీలో కూడా ఆరు ఇళ్లు పర్మిషన్ లేదని కూల్చారు. ఖానాపూర్‌లో 60, 70ఇళ్లు కూల్చారు. వాటిని ఎఫ్‌టీఎల్ అన్నారు. ఈ రెండింటిలో ఏది చేస్తున్నారనేది తెలియాలి. అయితే ఎఫ్‌టీఎల్ అయితే మోకీలా పరిధిలో చాలా అక్రమనిర్మాణాలు, ఫామ్ హౌజ్‌లు నిర్మించారు. అలా కొట్టుకుంటూ పోతే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎక్స్ మినిస్టర్స్, సీఎం, మాజీ సీఎం, మాజీ సీఎం అమ్మాయి, అబ్బాయి అందరి ఫామ్ హౌజ్‌లు కూల్చేయాలి.
ఇటు సీటీలోకి వస్తే, 50శాతం హైదరాబాద్‌ని కూల్చేయాల్సి వస్తుంది. ఎఫ్‌టీఎల్ విషయానికి వస్తే హైదరాబాద్‌లో చాలా చెరువులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. యూసఫ్ గూడలో చెరువు ఉండేది. ఇప్పుడు ఓ వైపు కృష్ణకాంత్ పార్క్, మరోవైపు ఇళ్లు వచ్చేశాయి. ఇలా చాలా చెరువులు అడ్రస్ లేవు. ఇప్పుడు భారీ వర్షాలు వచ్చినప్పుడు మా ఇళ్లల్లోకి నీళ్లు వచ్చాయని, మున్సిపల్ వాళ్లు రావడం లేదని కంప్లెయింట్ చేస్తున్న వాళ్లంతా ఇలా చెరువుల్లో, అక్రమంగా నిర్మించిన ఇళ్లే అని తేల్చి చెప్పారు తమ్మారెడ్డి భరద్వాజ.
ఈ విషయంలో కేటీఆర్.. ముందు మీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ల ఇళ్లు కూల్చాలి అంటున్నారు. ముందు వాళ్లవే కూల్చాలి. ఎందుకంటే గతంలో ఉన్నది వాళ్ల ప్రభుత్వమే కాబట్టి. మరి కూల్చితే ధైర్యం సీఎం రేవంత్ రెడ్డి చేస్తాడా? ఎందుకంటే కబ్జా చేసిన ఇళ్లు బిల్డింగ్‌లు కట్లుకున్న వాళ్లలో రాజకీయపెద్దలు, వాళ్ల ప్రభుత్వంలో ఉన్న వాళ్లతోపాటు పేదలు కూడా ఉన్నారు. వాళ్ల ఇళ్లని టచ్ చేస్తే ఓట్ల దెబ్బ పడుతుంది. ఈ నేపథ్యంలో ఇలా అన్ని అక్రమ నిర్మాణాలను కూల్చేస్తారా? అనేది సీఎం తేల్చుకోవాలి అని తమ్మారెడ్డి భరద్వాజ విమర్శిస్తూ, సీఎంకి, ప్రతిపక్ష నాయకులకు చురకలు అంటించారు.