రైటర్‌ వైరముత్తుకి బిగ్‌ షాక్‌.. ఓఎన్‌వీ పురస్కార ప్రకటనపై విమర్శలు.. అవార్డు వెనక్కి?

By Aithagoni RajuFirst Published May 29, 2021, 10:39 AM IST
Highlights

 గొప్ప సినీ గీత రచయిత ఓఎన్‌వీ గురుప్‌ పేరుతో ప్రారంభించిన ప్రతిష్టాత్మక జాతీయ సాహితీ పురస్కారాన్ని ఈ ఏడాదిగానూ వైరముత్తుకి ప్రకటించడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రముఖ తమిళ  రైటర్‌ వైరముత్తుకి ఇటీవల ఓఎన్‌వీ జాతీయ సాహితీ పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఆ మధ్య `మీటూ` మూవ్‌మెంట్‌లో భాగంగా ఆయనపై అనేక లైంగిక ఆరోపణలు వచ్చాయి. తమని వైరముత్తు ఎలా ఇబ్బంది పెట్టారో వెల్లడించారు. ప్రముఖ గాయని, డబ్బింగ్‌ ఆర్టిస్టు చిన్మయి ఏకంగా ఆయన పేరుపై డైరెక్ట్ గా ఆరోపణలు చేశారు. తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికీ ఆయనపై లైంగిక ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. 

ఈ నేపథ్యంలో గొప్ప సినీ గీత రచయిత ఓఎన్‌వీ గురుప్‌ పేరుతో ప్రారంభించిన ప్రతిష్టాత్మక జాతీయ సాహితీ పురస్కారాన్ని ఈ ఏడాదిగానూ వైరముత్తుకి ప్రకటించడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఇంతకు ముందు తమిళంలో `పూ`, `మరియాన్‌` వంటి చిత్రాల్లో కథానాయికగా నటించిన మలయాళ నటి పార్వతి ఓఎన్‌వీ గురుప్‌ అవార్డు వైరముత్తుకు ప్రకటించడాన్ని తీవ్రంగా విమర్శించారు. గొప్ప కవి, సినీ గీత రచయిత ఓఎన్‌వీ పేరుతో నెలకొల్పిన అవార్డును లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వైరముత్తుకు ప్రకటించడం ఆయన్ని అగౌరవపరచడమేనని పేర్కొన్నారు. 

గాయని చిన్మయి కూడా వైరముత్తుకు ఓఎన్‌వీ అవార్డు ప్రకటించడాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో అవార్డు ప్రదానం చేసే విషయాన్ని పునర్‌ పరిశీలించనున్నట్లు ఓఎన్‌వీ కల్చరల్‌ అకాడమీ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఓఎన్‌వీ గురుప్‌ పేరుతో 2017లో జాతీయ సాహితీ అవార్డులు ఏర్పాటు చేశారు. దీన్ని మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ కవులు, గీత రచయితలకే ప్రదానం చేస్తున్నారు. ఈ ఏడాది తమిళ ప్రఖ్యాత గీత రచయిత వైరముత్తుకు ప్రకటించారు.  అవార్డు గ్రహీతకు జ్ఞాపికతో పాటు, ధ్రువీకరణ పత్రం, రూ.3 లక్షల నగదు అందజేస్తారు. ఓఎన్‌వీ గురుప్‌ జాతీయ సాహితీ అవార్డుకు ఎంపిక కావడం గర్వంగా భావిస్తున్నట్లు వైరముత్తు పేర్కొన్నారు. వైరముత్తును సీఎం స్టాలిన్‌ అభినందించారు.

click me!