
కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ విక్రమ్ సంచనాలు నమోదు చేసింది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సైలెంట్ గా వచ్చిన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద దుమారమే రేపింది. తమిళ బిగ్గెస్ట్ హిట్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. తెలుగులో కూడా ఈ చిత్రం బయ్యర్లకు రెండింతలు లాభాలు తెచ్చిపెట్టింది.
కమల్ హాసన్ నటన, లోకేష్ కనకరాజ్ టేకింగ్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కూడా ఈ చిత్రానికి అదనపు బలం అయ్యారు. ఇక చివర్లో హీరో సూర్య ప్లే చేసిన కామియో రోల్స్ తిరుగులేని ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. రోలెక్స్ పాత్రలో సూర్య కొన్ని నిమిషాల పాటు సందడి చేశాడు.
భయంకరమైన విలన్ గా సూర్య గెటప్ ఆకట్టుకుంది. తాజాగా ఈ రోల్ పై సూర్య ఫిలిం ఫేర్ అవార్డ్స్ లో చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఆకాశం నీ హద్దురా చిత్రానికి గాను సూర్య ఉత్తమ నటుడిగా ఫిలిం ఫేర్ అవార్డు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా వేదికపై మాట్లాడుతూ.. నేను ఏం చేసినా ఈ స్థాయిలో నిలబడడానికి స్ఫూర్తిగా నిలిచింది మాత్రం కమల్ హాసన్ సార్.
ఆయన ఫోన్ చేసి ఓ అవకాశం ఉంది అని చెప్పినప్పుడు దానిని వదులుకోవాలని అనుకోలేదు. కానీ రోలెక్స్ పాత్రని మాత్రం చివరి నిమిషంలో అంగీకరించా. మొదట ఈ పాత్ర నేను చేయను అని లోకేష్ కనకరాజ్ కి చెబుదాం అనుకున్నా. కానీ ఒకే ఒక్క వ్యక్తి కోసం ఆ పాత్ర చేశా. అది కమల్ హాసన్ అని సూర్య వేదికపై తెలిపాడు.
రోలెక్స్ పాత్రతో సూర్య విలక్షణ నటుడిగా మరోసారి నిరూపించుకున్నారు. కమర్షియల్ చిత్రాలు చేస్తూనే నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలని కూడా సూర్య అంగీకరిస్తున్నారు. ఆకాశం నీ హద్దురా, జై భీం చిత్రాలు ఆ కోవకు చెందినవే.