
సీనియర్ నటుడు సుమన్ తరచుగా సినీ ఇండస్ట్రీ గురించి, పాలిటిక్స్ గురించి కామెంట్స్ చేస్తున్నారు. హీరోగా ఓ వెలుగు వెలిగిన సుమన్ ప్రస్తుతం విలన్, క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. మే 30న దర్శకరత్న దాసరి నారాయణరావు వర్ధంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సుమన్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో సుమన్ మాట్లాడుతూ టాలీవుడ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో క్రమశిక్షణ కొరవడిందని అన్నారు. ఈ సందర్భంగా సుమన్ దాసరి నారాయణరావుని గుర్తు చేసుకున్నారు. దాసరి గారు నిర్మాతలతో పాటు బయ్యర్ల గురించి కూడా ఆలోచించేవారని అన్నారు.
సినిమా పరాజయం చెందితే ఎక్కువగా నష్టపోయేది బయ్యర్లు. దరి గారు బయ్యర్ల క్షేమం గురించి ఆలోచించారు. ఒక సినిమా వల్ల నష్టపోతే తదుపరి చిత్రంతో అయినా బయ్యర్లకి ఆదుకునేందుకు ప్రయత్నించేవారు. కానీ ఇప్పుడున్న మేకర్స్ ఎవరూ బయ్యర్ల గురించి ఆలోచించడం లేదు. అనవసరంగా బడ్జెట్ పెంచేస్తున్నారు.
మేకర్స్ మీద నమ్మకంతోనే బయ్యర్లు సినిమా కొంటున్నారు. కానీ వారు నష్టపోతే మాత్రం పట్టించుకోవడం లేదు. అలాగే షూటింగ్స్ సమయంలో దర్శకులు సమయపాలన పాటించడం లేదు. నిర్మాతలకు ఆర్థిక భారం ఎక్కువయ్యేలా మేకర్స్ ప్రవర్తిస్తున్నారు అని సుమన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.