
కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన కెజిఎఫ్ 2 హిందీతో పాటు అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ముఖ్యంగా హిందీలో కెజిఎఫ్ 2(KGF Chapter 2) వసూళ్ల వర్షం కురిపిస్తుంది. సెకండ్ వీకెండ్ కూడా ఘనంగా ముగించిన కెజిఎఫ్ రూ. 321 కోట్లు కొల్లగొట్టింది. ఈ క్రమంలో కన్నడ స్టార్ సుదీప్ కెజిఎఫ్ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. హీరో యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రత్యేకంగా అభినందించారు. అలాగే ఆయన బాలీవుడ్ చిత్రాలతో పాటు, హిందీ భాషను ఉద్దేశిస్తూ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు.
సినిమా వేదికపై సుదీప్(Sudeep) మాట్లాడుతూ... ''పాన్ ఇండియా చిత్రాలు కన్నడలో తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలో నేను ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. హిందీ ఇకపై జాతీయ భాష కాదు. బాలీవుడ్ వాళ్ళు ఇప్పుడు పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో డబ్ అవుతున్న హిందీ చిత్రాలు సక్సెస్ కావడం లేదు. కానీ మన(కన్నడ) చిత్రాలు అన్ని భాషల్లో ఆదరణ దక్కించుకుంటాయి, అని ఒకరు నాతో అన్నారు,'' అని సుదీప్ అన్నారు.
పరోక్షంగా కన్నడ చిత్ర పరిశ్రమ హిందీ కంటే మంచి సినిమాలు చేస్తున్నారని, అలాగే హిందీ జాతీయ భాష కాదంటున్నారంటూ సుదీప్ చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. హిందీ భాషా ఆధిపత్యాన్ని సుదీప్ కామెంట్స్ ప్రశ్నించినట్లైంది. కేంద్ర మంత్రి అమిత్ షా దేశ ప్రజలు హిందీ భాషను ఇంగ్లీష్ కి ప్రత్యమ్నాయంగా ఉపయోగించాలంటూ చెప్పిన వారాల వ్యవధిలో సుదీప్ ఇలా మాట్లాడం ఆసక్తికరంగా మారింది. ఇక సుదీప్ లేటెస్ట్ మూవీ విక్రాంత్ రోనా విడుదలకు సిద్ధంగా ఉంది. జులై 28 రిలీజ్ డేట్ గా ప్రకటించారు. విక్రాంత్ రోనా తెలుగు, తమిళ భాషలతో పాటు హిందీలో కూడా విడుదల చేయనున్నారు.