మీ కంటే సుకుమార్ బెటర్.. శిష్యులను పట్టించుకోరే?

By Prashanth MFirst Published Feb 5, 2019, 3:12 PM IST
Highlights

టాలీవుడ్ లో స్టార్ దర్శకులు చాలా మంది ఉన్నారు. అయితే వారిలో శిష్యులను పట్టించుకునే మంచి దర్శకులు చాలా తక్కువ మందే ఉన్నారు. దర్శకత్వ శాఖలో ఏళ్ల తరబడి పనిచేసినా కూడా ఇంకా మొదటి అవకాశం కోసం తంటాలు పడుతూనే ఉన్నారు. 

టాలీవుడ్ లో స్టార్ దర్శకులు చాలా మంది ఉన్నారు. అయితే వారిలో శిష్యులను పట్టించుకునే మంచి దర్శకులు చాలా తక్కువ మందే ఉన్నారు. దర్శకత్వ శాఖలో ఏళ్ల తరబడి పనిచేసినా కూడా ఇంకా మొదటి అవకాశం కోసం తంటాలు పడుతూనే ఉన్నారు. ఎంత పెద్ద స్టార్ దర్శకుడైనా అసిస్టెంట్స్ లేనిదీ సినిమాను అస్సలు పూర్తి చేయలేడు. అలాంటి వారికి స్టార్ డైరెక్టర్స్ నుంచి సరైన మద్దతు లభించడం లేదనే చెప్పాలి.  అయితే సుకుమార్ లాంటి వారు మాత్రం తన దగ్గర పనిచేసిన వారికి మంచి అవకాశాలు ఇస్తున్నాడు. 

తన దగ్గర ఎంతో కాలంగా పనిచేస్తున్న నాలుగురు దర్శకులను ఇప్పుడు డైరెక్టర్స్ గా ఓ మంచి దారిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సొంత ప్రొడక్షన్ లోనే సినిమాలను నిర్మిస్తూ అవసరమైతే ఇతర నిర్మాతలతో కలిసి శిష్యులు డైరెక్ట్ చేస్తున్న సినిమలను నిర్మిస్తున్నారు. సుక్కు కంటే ఎక్కువగా త్రివిక్రమ్ - రాజమౌళి అలాగే బోయపాటి శ్రీను కొరటాల శివ పూరి జగన్నాథ్ వంటి దర్శకుల వద్ద ప్రతి సినిమాకు పదుల సంఖ్యలో చాలా మంది  డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కష్టపడుతున్నారు. 

తమ వద్ద ఉన్న వారు డైరెక్షన్ లోకి అడుగుపెడితే సపోర్ట్ ఇస్తామని సినిమాలను నిర్మిస్తామని చెబుతున్నప్పటికీ మొదటి అడుగువేసేందుకు ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా రాజమౌళి లాంటి దర్శకుడిని నుంచి ఒక్క స్మార్ట్ డైరెక్టర్ అయినా ఇండస్ట్రీలో ఉన్నారా అని నార్త్ మీడియా వెతికితే ఒక్కరు కూడా దొరకలేదు. అప్పట్లో దిక్కులు చూడకు రామయ్య దర్శకుడు త్రికోటి కి కొంచెం మద్దతు ఇచ్చినా అతను క్లిక్ అవ్వలేదు. మిత్రుడు - జాగ్వార్ దర్శకుడు మహాదేవ్ కూడా మళ్ళీ కనిపించలేదు.  

ఇక మగధీర నుంచి బాహుబలి వరకు వర్క్ చేసిన యువ దర్శకుల లిస్ట్ పెద్దదే కానీ ఎవరు క్లిక్ అవ్వలేదు. శంకర్ లాంటి దర్శకుడు తన అసిస్టెంట్స్ లో శక్తిని గమనించి ప్రేమిస్తే - వైశాలి వంటి ఎన్నో సినిమాలను నిర్మించి వారికి ఒక లైఫ్ ఇచ్చాడు. మెర్సల్ - రాజా రాణా - తేరి వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న అట్లీ శంకర్ శిష్యుడే. ఇక త్రివిక్రమ్ నుంచి కూడా పెద్దగా శిష్యులు రావడం లేదు. అలాగే కొరటాల శివ గతంలో తన శిష్యులు మంచి కథలు సెట్ చేసుకున్నారని తొందర్లోనే వారితో సినిమాలను నిర్మిస్తానని చెప్పాడు. కానీ ఇంతవరకు ఒక్క సినిమా సెట్ కాలేదు. 

ఇక బోయపాటి మాస్ సినిమాలు ఏ రేంజ్ లో చేస్తాడో అందరికి తెలిసిందే. స్క్రిప్ట్ నుంచి అసిస్టెంట్ దర్శకులనుకు బాగా ఉపయోగించుకునే బోయపాటి స్టూడెంట్స్ కెరీర్ కు ఒక లిఫ్ట్ ఎంతవరకు ఇస్తున్నారో ఇప్పటివరకు తెలియదు. ఇక పూరి జగన్నాథ్ మొదట్లో బంపర్ అఫర్ వంటి సినిమా ద్వారా తన అసిస్టెంట్ దర్శకులకు బూస్ట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు గాని ఆ తరువాత ఆయన సక్సెస్ రేట్ తగ్గడంతో శిష్యుల గురించి పట్టించుకోవట్లేదని టాక్ వస్తోంది. 

శేఖర్ కమ్ముల హ్యాపీడేస్ అనంతరం తన శిష్యులను కొంత సపోర్ట్ చేసే ప్రయత్నం చేశారు. అయితే వారిలో చాలా మంది సొంతంగా ఎదిగారు. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ ఆయన శిష్యుడే. త్రివిక్రమ్ స్టూడెంట్ వెంకీ కుడుములు(ఛలో దర్శకుడు) కూడా సొంతంగానే ప్రయత్నాలు చేశాడు. త్రివిక్రమ్ ప్రమోషన్ లో కొంత వరకు సపోర్ట్ ఇచ్చారు. గతంలో రామ్ గోపాల్ వర్మ చాలా వరకు శిష్యులతోనే సినిమాలను నిర్మించేవారు. కానీ మన స్టార్ దర్శకులు కొంత మంది సపోర్ట్ ఇవ్వడంలో ఇంకాస్త ఎక్కువగా ఆలోచిస్తే యువతరం వయసు 30 దాటకముందే మెగాఫోన్ పట్టుకునే అవకాశం ఉంటుంది.  

click me!