
సూపర్ స్టార్ రజనీకాంత్, కబాలి దర్శకుడు పా రంజిత్ కాంబినేషన్‌లో ప్రతిష్థాత్మకంగా రూపొందుతున్న కాలా కరికాలన్ చిత్రం షూటింగ్ సందర్భంగా జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. షూటింగ్ సందర్భంగా ఎలక్ట్రిక్ షాక్ తగలడంతో చిత్ర యూనిట్ చెందిన వ్యక్తి మృత్యువాత పడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి కారణాలేంటనే కోణంలో పోలీసుల కేసును విచారిస్తున్నారు.
హాజీ మస్తాన్ జీవితం ఆధారంగా రూపొందుతున్నట్టు వార్తలు వస్తున్న కాలా కరికాలన్ చిత్ర షూటింగ్ ముంబైలో శరవేగంగా జరుగుతోంది. షూటింగ్ సందర్భంగా ఎలక్ట్రిక్ షాక్ తగలి గురువారం మైఖేల్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన మైఖేల్ ను హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. కానీ దురదృష్టవశాత్తూ చికిత్స పొందుతూ మైఖేల్ మరణించాడు.
కబాలి తర్వాత పా రంజిత్, రజనీకాంత్ కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం కాలా. ఈ చిత్రం ప్రారంభానికి ముందే అనేక అవరోధాలు ఎదురవుతున్నాయి. హాజీ మస్తాన్‌ను కించపరుస్తూ సినిమా తీస్తే సహించేది లేదని గ్యాంగ్‌స్టర్ వారసుడు హెచ్చరించాడు. ఆ తర్వాత సినిమా కథ అంతా కల్పన. ఎవరి జీవితానికి సంబంధించింది కాదు.. ఎవర్నీ ఉద్దేశించి తీస్తున్నది కాదు అని దర్శకుడు పా రంజిత్ వివరణ ఇచ్చారు. ప్రముఖ గ్యాంగ్‌స్టర్ హాజీ మస్తాన్ ముంబై నేర సామ్రాజ్యాన్ని శాసించిన సంగతి తెలిసిందే. ముంబైలోని ధారవి ప్రాంతంలో నివసించే తమిళ ప్రజల హక్కుల కోసం హాజీమస్తాన్ పోరాడాడు.
వండర్ బార్ ఫిలిం బ్యానర్‌పై హీరో ధనుష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హ్యుమా ఖురేషి, నానా పాటేకర్, అంజలి పాటిల్, ఈశ్వరీ రావు, సముద్రఖని తదితరలు నటిస్తున్నారు. ఈ చిత్రంలో యంగ్ రజనీకాంత్‌గా ధనుష్ నటించనున్నారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి.