
బాహుబలి సినిమా తెలుగు సినిమా స్థాయిని ఏ రేంజ్ కు తీసుకెళ్లిందో చూస్తునే ఉన్నాం. బాహుబలి సినిమా కోసం 5ఏళ్ల సమయం వెచ్చించి తిరుగులేని దృశ్యకావ్యంగా తెరకెక్కించారు దర్శకుడు రాజమౌళి. రాజమౌళికి ఇప్పుడు దేశంలోనే నెంబర్ వన్ దర్శకుడిగా పేరు తెచ్చిపెట్టడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన సినిమా బాహుబలి.
కలెక్షన్ల పరంగానూ రికార్డులకెక్కబోతున్నదనే నమ్మకంతో ఉన్నారు నిర్మాతలు. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా 700 కోట్లు దాటింది. అందుకే దేశంలోనే హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డులకెక్కిన పీకే సినిమా రికార్డులను కూడా ఈ సినిమా వారంలోపే తిరగ రాయనుందని అంచనాలున్నాయి.
ఇంతటి రికార్డుల సునామీ సృష్టిస్తున్న ఈ సినిమా రెండు పార్టులు పూర్తి చేయడానికి ఐదేళ్లు పట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా పూర్తయేందుకు ఇంత సమయం పడుతుందని తెలిస్తే అసలు మొదలు పెట్టే వాన్నే కాదని రాజమౌళి అన్నారు. ఇక దర్శకునిగా నంబర్ వన్ స్థానంలో ఉండాలనుకున్న తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నానని, ఇంతకన్నా వేరే లక్ష్యం ఏదీ లేదని రాజమౌళి అన్నారు.
బాహుబలి తర్వాత రాజమౌళి ఏం చేయబోతున్నాడన్న ప్రశ్నకు ఆయన గత కొంతకాలంగా ఒకే సమాధానం చెప్తున్నారు. కనీసం రెండు నెలలైనా లీవ్ కావాలంటున్నారు. ఈ సెలవుల్లో భూటన్ వెళ్లే ప్లాన్ చేస్తున్నారట. ఇక ఆ తర్వాత మాత్రం కమర్షియల్ సినిమా తీస్తాను తప్ప మహాభారతం లాంటిదో, బాహుబలి లాంటిదో తీయనని రాజమౌళి చెప్పారు. మహాభారతం తీయాలంటే తనకు కనీసం మరో పదేళ్లు సమయం పడుతుందని చెప్పారు.