ఇటు ఎండల దంచుడు.. అటు టికెట్ ధరల బాదుడు.. కట్టప్ప ఎంత పని చేశాడు

First Published Apr 27, 2017, 8:53 AM IST
Highlights
  • బాహుబలి రిలీజ్ మరి కొద్ది గంటల్లోనే..
  • టికెట్స్ కోసం ప్రేక్షకులు, అభిమానుల తంటాలు
  • టికెట్ ధరల పెంపుపపై సర్వత్రా నిరసనలు
  • ధరలు పెంచితే చర్యలు తప్పవంటున్న ఎపీ, తెలంగాణ సర్కారు

దేశవ్యాప్తంగా బాహుబలి2 మేనియాతో జనం అంతా టికెట్ల కోసం నానా అవస్థలు పడుతున్నారు. ఓ ఇద్దరు కలిస్తే ఫస్ట్ మాట్లాడుకునేది బాహుబలి టికెట్స్ గురించే అంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బాహుబలి2 మరికొద్ది గంటల్లో రిలీజ్ కాబోతుండటంతో టికెట్స్ కోసం వీలైన మార్గాలన్నీ వెతుక్కుంటున్న బాహుబలి అభిమానులు ఒకవైపుంటే... మరోవైపు టికెట్ల ధరల పెంపుపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

 

ఇప్పటికే సినీ ప్రేక్షకుల సంఘాలు కొన్ని టికెట్ల ధరలను అదుపులో ఉంచాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాయి. మరోవైపు టికెట్స్ కోసం తంటాలు పడుతున్న ప్రేక్షకులను రేట్ల పెంపు కుదేలు చేస్తోంది. బాహుబలి2 కున్న క్రేజ్ దృష్ట్యా.. ఏపీ తెలంగాణల్లోని అన్ని థియేటర్స్ లో సింగిల్ స్క్రీన్ టాకీసుల్లో 20రూపాయలు, మల్టీ ప్లెక్స్ లలో అయితే కాంబో ప్యాకేజీలతో ఫుడ్ అండ్ బెవరేజెస్ కలిపి టికెట్ ధరలు వాయించేస్తున్నారు.

 

టికెట్ల ధరల పెంపుపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్, విజయవాడల్లో టికెట్ల ధర బ్లాకులో పది నుంచి పదిహేను రెట్లు కూడా పెరిగిందని తెలుస్తోంది. కౌంటర్స్ లోనే ఇలాంటి పరిస్థితి ఉంటే.. ఇక క్యూ లైన్స్ లో టికెట్స్ కొనేవారు మరింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు ఎండలు దంచేస్తుంటే... మరో వైపు టికెట్స్ ధరలు పెంచేసి థియేటర్ యాజమాన్యాలు టికెట్ల రేట్ల పెంపుతో బాదేస్తున్నాయి.

 

అదే రేంజ్ లో తిరగుబాటు కూడా జోరందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో టెకెట్ల పెంపుపై నిరసనలు పెల్లుబికుతున్నాయి. అనంతపురం జిల్లా ,తాడిపత్రి పట్టణంలో బాహుబలి సినిమా టికెట్ అధిక ధరలకు విక్రయించడాన్ని నిరసిస్తూ విజయలక్ష్మి థియేటర్ ఎదురుగా ప్రేక్షకుల ధర్నా. ప్రేక్షకుల ఫై థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించడంతో థియేటర్ వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కొనసాగుతోంది.

 

ఇరు ప్రభుత్వాలు చొరవ చూపి అదనపు షోలకు ఎలా అనుమతినిచ్చాయో.. టికెట్ల ధరల నియంత్రణకు కూడా అదే తరహాలో చొరవ చూపాలని ప్రేక్షకులు కోరుతున్నారు.

 

click me!