వివాదంలో ఇరుక్కున్న రాజమౌళి

First Published Jan 3, 2018, 1:10 AM IST
Highlights
  • బాహుబలితో క్రేజీ దర్శకుడిగా మారిన దర్శకధీరుడు
  • తాజాగా ఓ గుడిలో పంచెకట్టుతో కనిపించిన జక్కన్న
  • రాజమౌళి నాస్తికుడినంటూ గుడిలో అలా తిరగటమేంటని ప్రశ్న

బాహుబలి మూవీతో తెలుగు సినిమాకు ప్రపంచస్థాయిలో కీర్తినార్జించిన దర్శక ధీరుడు జక్కన్న రాజమౌళి. సాధారణంగా వివాదరహితుడుగా.. అజాత శత్రువు లాగా మెలుగుతుంటాడు రాజమౌళి. ఆయనిప్పుడో వివాదంలో చిక్కుకున్నారు. ప్రముఖ హేతువాది.. ఇండియన్ హ్యూమనిస్ట్- రేషనలిస్ట్ అండ్ హ్యూమన్ రైట్స్ ఉద్యమకారుడు బాబు గోగినేని రాజమౌళి తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు.

 

తాను నాస్తికుడినంటూ రాజమౌళి గతంలో ఒకట్రెండు ఇంటర్వ్యూల్లో గతంలో చెప్పుకున్న నేపథ్యంలో.. పైకి నాస్తికుడినని చెప్పుకుంటూ దానికి విరుద్ధంగా రాజమౌళి ప్రవర్తిస్తున్నాడని బాబు గోగినేని విమర్శించారు. రాజమౌళి లాంటి వాళ్ల వల్ల తమ లాంటి నిజమైన నాస్తికులం ఇబ్బంది పడుతున్నామని.. రాజమౌళి తీరు మార్చుకోవాలని ఆయన అన్నారు.

ఓ ఇంటర్వ్యూలో తాను నాస్తికుడిని అని చెప్పుకున్న రాజమౌళి.. ఆ తర్వాత రెండ్రోజులకే చొక్కా విప్పేసి కండువా వేసుకుని ఒక బ్రాహ్మణుడితో కలిసి లాంఛనంగా గుడికి వెళ్లారని బాబు అన్నారు. రాజమౌళి గుడికి వెళ్లడంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని.. అయితే అలాంటివి చేస్తూ తాను నాస్తికుడిని అని చెప్పుకోవడమే సరికాదని ఓ టీవీ ఛానెల్ చర్చలో భాగంగా బాబు అభిప్రాయపడ్డారు.

నాస్తికుడంటే దేవుడు లేడు అని నమ్మేవాడని.. తనలా దేవుడు లేడని నమ్ముతూ బతికే వాళ్లు చాలామంది ఉన్నారని..  ఈ ప్రపంచంలో వంద కోట్ల మందికి పైగా మతం లేకుండా.. దేవుడిని నమ్మకుండా ఉంటున్నారని.. కానీ రాజమౌళి నాస్తికుడినని చెబుతూ గుడికి వెళ్లడం ఏమిటని బాబు ప్రశ్నించారు. ఇలాంటి వాళ్ల వల్ల తమ లాంటి వాళ్లు బద్నాం అవుతున్నామన్నారు. గతంలో సీపీఐ నారాయణ కూడా ఇలాగే ప్రవర్తించారని.. రాజమౌళికి ఈ విషయంలో తాను సంధించిన ప్రశ్నలకు జవాబు రాలేదని.. ఆయన తప్పు చేశారు కాబట్టి సమాధానం ఇవ్వలేరని భావిస్తున్నట్లు బాబు అభిప్రాయపడ్డారు.

click me!