
`నిర్భందాలను కౌగిలించుకున్న వసంత కాలం మనదే. రేపు మనం ఉన్నా లేకపోయినా, చరిత్ర ఉంటుంది. మన ప్రేమకందరికి కనిపిస్తుంది` అని అంటోంది సాయిపల్లవి. తాను నటిస్తున్న `విరాటపర్వం` చిత్రంలోని `సోల్ ఆఫ్ వెన్నెల`లో ఆమె వెన్నెలగా చెప్పిన మాటలివి. దీనికి.. `వెన్నెల రెండు సార్లు జన్మించింది. తొలిపొద్దులో ఇప్పపూలు పూసినట్టు అడవి తల్లిలో ఒకసారి. ఆశయాన్ని ఆయుధంగా చేసినట్టు అతని ప్రేమలో మరోసారి` అంటున్నారు దర్శకుడు వేణు ఉడుగుల. `విరాటపర్వం`లో వెన్నెల కథా గమనాన్ని ఆవిష్కరిస్తూ ఆయన చెప్పిన మాటలివి.
తాజాగా సాయిపల్లవి బర్త్ డే సందర్భంగా `విరాటపర్వం` చిత్రంలోని `సోల్ ఆఫ్ వెన్నెల` పేరుతో విడుదల చేసిన స్పెషల్ వీడియో కట్టిపడేస్తుంది. హృదయాలను కదిలిస్తుంది. వెన్నెలతో మనల్ని ట్రావెల్ చేస్తుంది. 1990లోకి తీసుకెళ్తుంది. సాయిపల్లవి పుట్టిన రోజు సందర్భంగా `విరాట పర్వం` టీమ్ విడుదల చేసిన ఈ స్పెషల్ వీడియో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ చిత్రానికి వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తుంగా, రానా, సాయిపల్లవి జంటగా నటిస్తున్నారు. ప్రియమణి, నివేతా పేతురాజ్, నవీన్ చంద్ర కీలకపాత్రలు పోషిస్తున్నారు. సురేష్‌బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
1990లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా, నక్సలైట్ నాయకుడు రవన్న అలియాస్ డాక్టర్ రవిశంకర్ జీవితం ఆధారంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు దర్శకుడు వేణు ఉడుగుల. నక్సల్ పోరాటం, విప్లవ భావాలు, కమ్యూనిస్టు ఉద్యమాలు 1990లో ఎలా ఉండేవి, తమకు, పేద ప్రజలకు జరిగిన అన్యాయాలపై రవన్న చేసిన పోరాటాన్ని ఇందులో చూపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, గ్లింప్స్ సినిమాలపై అంచనాలను పెంచాయి. జులై 1న ఈ సినిమా థియేటర్లో విడుదల కాబోతుంది.