
సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ విభాగం.. ఇండియా యూనిట్‌ని జీ ఎంటర్‌టైన్‌మెంట్స్ లో విలీనం చేయాలని రెండేళ్ల క్రితం భావించింది. అయితే ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. సోనీ ఇండియాని జీ ఎంటర్‌టైన్‌మెంట్స్ లో కలిపే ప్రక్రియని విరమించుకునే ఆలోచనలో ఉందని తెలుస్తుంది. ఈ మేరకు విలీనం చేయాలనే ఒప్పందాన్ని రద్దు చేసే యోచనలో ఉందట.
జీ ఎంటర్‌టైన్‌మెంట్ వ్యవస్థాపకుడి కుమారుడు పునీత్ గోయెంకా దీనికి నాయకత్వం వహిస్తాడా? లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. తాము మెర్జ్ చేశాక ఆయన నాయకత్వ బాధ్యతలు చేపట్టకపోతే ఏంటనే అనుమానంతో జపాన్‌కి చెందిన సోనీ సంస్థ మేనేజ్‌మెంట్ వెనక్కి తగ్గినట్టు సమాచారం. 2021లో తమ ఒప్పందం ప్రకారం ఇండియా విభాగానికి గోయెంకా కంపెనీ సీఈవో బాధ్యతలు తీసుకోవాలి. కానీ సోనీ రెగ్యులేటరీ విచారణ మధ్య ఆయన్ని ఇప్పుడు సీఈవోగా కోరుకోవడం లేదు.
గతేడాది సెబీ(సెక్యూరిటీ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) అప్పటి ఎస్సెల్ గ్రూపు చైర్ పర్సన్ సుభాష్ చంద్ర, పునీత్ గోయెంకా సెబీలో లిస్ట్ అయినా కంపెనీలో డైరెక్టర్ గానీ, కీలకమైన మేనేజర్ పదవిని నిర్వహించకుండా నిరోధించింది. తమ సొంతం ప్రయోజనాల కోసం ఆయన నిధులను స్వాహా చేసినందుకు సెబీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆయనపై దీనికి సంబంధించిన విచారణ జరుగుతున్న నేపథ్యంలో సోనీ రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక తమ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలనుకుంటుందట.
ఒప్పందం ప్రకారం ఈ నెల 20 వరకు తమ నిర్ణయాన్ని వెల్లడించాల్సి ఉండగా, దాన్ని రద్దు చేసేందుకు కోర్ట్ లో దావా దాఖలు చేయాలని యోచిస్తుందట సోనీ. అయితే పునీత్ గోయెంకా మాత్రం విలీనం అయ్యాక జీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థకి సీఈవో బాధ్యతలు చేపట్టాలని భావిస్తున్నారు. దీంతో సోనీ నిర్ణయం పెద్ద షాక్ అనే చెప్పాలి.