సోనీ.. ఒప్పంద నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు మధ్యవర్తిత్వం కోరిన నేపథ్యం లో బ్రేకప్ ఫీజు కింద 9 కోట్ల డాలర్లు (రూ.747 కోట్లు) చెల్లించాలని డిమాండ్ చేసింది.
జీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కుదుర్చుకున్న 1,000 కోట్ల డాలర్ల (రూ.83,000 కోట్లు) విలువైన విలీన ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు సోనీ గ్రూప్ భారత అనుబంధ విభాగమైన సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ప్రస్తుతం కల్వర్ మ్యాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్) ప్రకటించింది. డీల్ రద్దు నోటీసును జీ గ్రూప్‌నకు పంపిన సోనీ.. ఒప్పంద నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు మధ్యవర్తిత్వం కోరిన నేపథ్యం లో బ్రేకప్ ఫీజు కింద 9 కోట్ల డాలర్లు (రూ.747 కోట్లు) చెల్లించాలని డిమాండ్ చేసింది. ఈ రెండు మెగా సంస్దలు విలీనం తర్వాత ఏర్పడే కొత్త సంస్థకు ఎవరు నేతృత్వం వహించాలన్న విషయంపై ప్రతిష్ఠంభన తొలగకపోవడంతో సోనీ ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
వివరాల్లోకి వెళితే...2021 డిసెంబర్ నెలలో విలీనం ఒప్పందంపై జీ ఎంటర్‌టైన్‌మెంట్, సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ ఇండియా సంతకాలు సంతకాలు చేశాయి. ఈ ట్రాన్సాక్షన్ పూర్తి చేసేందుకు రెండేళ్ల కాలవ్యవధి నిర్దేశించుకున్నాయి. ఈ గడువు 2023, డిసెంబర్ 21తోనే ముగియగా.. అదనంగా మరొక నెల రోజుల పాటు పొడిగించుకున్నాయి. అయినప్పటికీ.. విలీనం దిశగా ఏకాభిప్రాయం కుదరలేదు. ఇప్పటికే CCI, NSE, BSE, వాటాదారుల ఆమోదం పొందిన ఈ విలీన ఒప్పందం రద్దయింది.
2021 సంవత్సరంలో అనుకున్న డీల్ ప్రకారం.. కొత్తగా ఏర్పాటయ్యే విలీన సంస్థను (జీ-సోనీ విలీనం) జీ ఎండీ, సీఈఓ పునీత్ గోయెంకా నడిపించాల్సి ఉంది. ఈ క్రమంలోనే నిధుల మళ్లింపు కేసులో జీ సహా ఇతర సంస్థల్లో కీలక పదవులు చేపట్టకుండా పునీత్‌పై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) నిషేధం విధించింది. ఈ నేపథ్యంలోనే పునీత్ నాయకత్వంపై సోనీ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. 2023 ఆగస్టులో నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ముంబయి బెంచ్ కూడా ఈ విలీనానికి అనుమతి ఇచ్చింది. కానీ రెండు కంపెనీలు గడువును ఒక నెల పొడిగించినప్పటికీ తమ విభేదాలను పరిష్కరించడంలో విఫలమయ్యాయి.