
దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఓ సోషల్ బర్నింగ్ టాపిక్ తీసుకుని యాక్షన్ ఎంటర్టైనర్ గా గాండీవధారి అర్జున తెరకెక్కించారు. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ అధిక భాగంగా లండన్ లో జరిగింది. దీంతో బడ్జెట్ రూ. 50-60 కోట్లు పెట్టారని సమాచారం. వరుణ్ తేజ్ మార్కెట్ తో పోల్చుకుంటే ఇది చాలా ఎక్కువ. దానికి తోడు డిజాస్టర్ టాక్. గాండీవధారి అర్జున ఫస్ట్ డే కలెక్షన్స్ కేవలం కోటి రూపాయలు. వరుణ్ తేజ్ కెరీర్లోనే అతి తక్కువ ఓపెనింగ్స్ గాండీవధారి అర్జున చిత్రానికి దక్కాయి.
ఇక రెండో రోజే థియేటర్స్ నుండి ఎత్తేసే పరిస్థితి. ఈ మూవీ థియేట్రికల్ హక్కులు రూ. 17 కోట్లకు అమ్మారు. కనీసం నాలుగో వంతు వచ్చే సూచనలు లేవు. రెండు వారాల్లోనే గాండీవధారి అర్జున ఓటీటీలోకి వచ్చేస్తుందని సమాచారం. ఈ చిత్ర నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ భారీగా నష్టపోయారు. అయితే నాగబాబు ప్రాజెక్ట్ నుండి తప్పుకుని సేవ్ అయ్యారన్న మాట వినిపిస్తోంది.
ఈ చిత్ర నిర్మాణ భాగస్వామిగా నాగబాబు ఉన్నారట. కారణం తెలియదు కానీ ఆయన మధ్యలో తప్పుకున్నారు. దాంతో బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఒకవేళ నాగబాబు నిర్మాతగా ఉంటే ఆయనకు మరో ఆరెంజ్ పడేదన్న వాదన మొదలైంది. నాగబాబు నిర్మించిన అన్ని చిత్రాలు ప్లాప్. ఆరెంజ్ అయితే మొత్తంగా ముంచేసింది. కథ రీత్యా అధికభాగం సిడ్నీలో షూట్ చేశారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆరెంజ్ డిజాస్టర్ కావడంతో నాగబాబు కోట్లలో నష్టపోయారు.
ఆ నష్టాలు పూడ్చేందుకు ఉన్నవన్నీ అమ్ముకున్నాడు. ఆయన జబర్దస్త్ జడ్జి అవతారం ఎత్తాల్సి వచ్చింది. ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని నాగబాబు అన్నారు. సిడ్నీలో షూట్ చేసిన ఆరెంజ్ మాదిరే లండన్ లో షూట్ చేసిన గాండీవధారి అర్జున డిజాస్టర్ అయ్యింది. ఈ చిత్ర నిర్మాతగా ఉంటే నాగబాబుకు ఆర్థిక కష్టాలు తప్పేవి కావని సోషల్ మీడియా టాక్.