తమిళ హీరో ధనుష్‌కి తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ఆయన తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ తెలుగు, తమిళం బైలింగ్వల్‌గా `సార్` మూవీ చేశారు. వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సంయుక్త హీరోయిన్‌గా నటించగా, నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఎడ్యూకేషన్‌పై సందేశాత్మకంగా రూపొందిన ఈ చిత్రం తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకుందా? అనేది రివ్యూ(Sir Movie Review)లో తెలుసుకుందాం.
తమిళ హీరో ధనుష్‌కి తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగులోనూ అనువాదం అవుతూ ఆకట్టుకుంటున్నాయి. అలా ఇక్కడ ఆయనకంటూ ఓ సపరేట్ ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే సినిమా మారింది. పాన్ ఇండియా చిత్రాల ట్రెండ్ ఊపందుకున్నాయి. భాషల మధ్యఅడ్డుగోడలు చెదిరిపోతున్నాయి. ఈక్రమంలో ధనుష్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ తెలుగు, తమిళం బైలింగ్వల్‌గా `సార్` మూవీ చేశారు. `తొలిప్రేమ`, మిస్టర్ మజ్ను`,`రంగ్ దే` చిత్రాలతో ఆకట్టుకున్న వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సంయుక్త హీరోయిన్‌గా నటించగా, నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఎడ్యూకేషన్‌పై సందేశాత్మకంగా రూపొందిన ఈ చిత్రం తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకుందా? అనేది రివ్యూ(Sir Movie Review)లో తెలుసుకుందాం.
కథః
20వ దశకంలో జరిగే కథ ఇది. బాలు (ధనుష్) త్రిపాఠి కాలేజ్ ఆఫ్ ఇనిస్టిట్యూట్‌లో జూనియర్ లెక్చరర్ గా పనిచేస్తుంటారు. ప్రైవేటీకరణ నేపథ్యంలో ప్రైవేట్ విద్యాసంస్థల హవా సాగుతుంటాయి. మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులే లక్ష్యంగా విద్యా పెద్ద వ్యాపారంగా మారుతుంది. ప్రభుత్వ విద్యాసంస్థలను బాగు చేయడం కోసం రాష్ర్ట ప్రభుత్వం బిల్లు తీసుకురాబోతుందని తెలుసుకున్న త్రిపాఠి విద్యాసంస్థల అధినేత (సముద్రఖని) తనే ప్రభుత్వ విద్యాసంస్థలను దత్తత తీసుకుని అక్కడ తన కాలేజీలలోని జూనియర్ లెక్చరర్స్ ని, ట్యూటర్లని ప్రభుత్వ కాలేజీలకు లెక్చరర్స్ గా పంపిస్తాడు. అలా బాలు సిరిపురం జూనియర్ కాలేజీకి మ్యాథ్స్ లెక్చరర్‌గా తన ఇద్దరు టీమ్‌తో(హైపర్ ఆది) కలిసి వెళ్తాడు. అక్కడ కుల వివక్ష ఉంటుంది, చదువుకోవాల్సిన విద్యార్థులు సరైన లెక్చరర్స్ లేక కూలిపనులు చేస్తుంటారు. బాలు ఊరి ప్రజలను,విద్యార్థులను మోటివేట్ చేసి కాలేజీకి వచ్చేలా చేస్తాడు. ఆ ఏడాది వంద శాతం పాస్ పర్సంటెజీతో స్టేట్‌లోనే నెంబర్ వన్‌గా తన కాలేజీని నిలుపుతాడు. ఇది తెలుసుకున్న త్రిపాఠి.. బాలుని అడ్డుకునే ప్రయత్నంచేస్తాడు, ఆయన్ని స్టడీస్ చెప్పనివ్వకుండా అనేక అడ్డంకులు క్రియేట్ చేస్తాడు. దీంతో బాలు ప్రైవేట్ కాలేజీలు చేస్తున్న మోసాలను, తమని అడ్డుకున్న త్రిపాఠిని ఎలా ఎదిరించాడు, అనేక అడ్డంకుల నడుము స్టూడెంట్స్ కి ఎలా క్లాసులు చెప్పాడు? ఈ క్రమంలో ఎలాంటి ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు, బయోలజీ లెక్చరర్ మీనాక్షి(సంయుక్త) ఆయనకు ఎలా అండగా నిలబడింది, ఇందులో సుమంత్ పాత్రేంటి అనేది మిగిలిన కథ.
undefined
విశ్లేషణః
1990లో కేంద్రప్రభుత్వం ప్రైవేటీకరణ బిల్లు తెచ్చాక ప్రైవేట్ సంస్థలు ఇండియాలో కోకొల్లలుగా పుట్టుకొచ్చాయి. అలా విద్యా వ్యాపారంగా మారింది. ప్రైవేట్ విద్యాసంస్థలు క్వాలిటీ ఎడ్యూకేషన్ పేరుతో విద్యార్థుల వద్ద వేలకు వేల ఫీజులు వసూలు చేస్తూ దోచుకుంటున్నారు. టాలెంట్ ఉన్న ప్రభుత్వ కాలేజీల లెక్చరర్స్ ని ప్రైవేట్ విద్యాసంస్థలు ఎక్కువ సాలరీలు ఇచ్చి కొనుక్కుంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ విద్యాసంస్థలు మూత పడే పరిస్థితికి ఎదురవుతుంది. ఐటీ రావడంతో ఇంజనీరింగ్ స్టడీస్‌కి డిమాండ్ పెరిగింది. ఎంసెట్ కకోచింగ్‌లు, బిఫార్మసీ, ఇంజనీరింగ్, మెడికల్ స్టడీస్ పేదవారికి అందని ద్రాక్షలా మారిపోయాయి. దీనిపై ఓ ప్రైవేట్ కాలేజీ జూనియర్ లలెక్చరర్ చేసిన పోరాటమే ఈ సినిమా కథ. 2000 టైమ్‌లో వాస్తవంగా ఉన్న పరిస్థితులను చర్చించిన చిత్రమిది. ఆ జనరేషన్ స్టూడెంట్స్ ఫేస్ చేసిన అంశాలను ఇందులో కళ్లకి కట్టినట్టు చూపించారు దర్శకుడు వెంకీ అట్లూరి.
ఇక సినిమా మొదటి భాగం చాలా ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. ధనుష్ తన కాలేజీల ఛైర్మెన్‌కి ఛాలెంజ్ చేసి జూనియర్ కాలేజీకి తనతోపాటు హైపర్ ఆది, మరో లెక్చరర్ ని తీసుకుని సిరిపురం జూ కాలేజ్‌కి వెళ్లడం, అక్కడ ఎదురయ్యే అనుభవాలు, స్టూడెంట్స్ కాలేజీలకు రాకుండా కూలి పనులు చేసుకోవడం, వారిని ధనుష్ మోటివేట్ చేసి తిరిగి కాలేజీకి వచ్చేలా చేయడం ఇవన్నీ కొంతసీరియస్‌గా, మరింత ఎంటర్‌టైనింగ్ వేలో చెప్పడం బాగుంది. దీంతో ఫస్టాఫ్ అంతా ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. మధ్యలో హైపర్ ఆది కామెడీ కాస్త నవ్వులు పూయిస్తుంది. మొదటి భాగం మొత్తం హీరో ఇంట్రడక్షన్, ఓ పాట, హీరోయిన్‌తో లవ్ స్టోరీ ప్రధానంగానే సాగుతుంది. సింపుల్ స్క్రీన్‌ప్లేతో ఓ ఫ్లోలో కథ నడుస్తుంది. ఇక సెకండాఫ్ మొత్తం టర్న్ తీసుకుంటుంది. ఎమోషనల్‌గా మారిపోతుంది. హీరో లక్ష్యాన్ని సముద్రఖని అడ్డుకోవడం, తప్పుడు కేసులు పెట్టి ఊరు నుంచి తరిమేయడం, తమకు చదువు చెప్పిన గురువు కష్టాలను చూసి చలించిపోయిన విద్యార్థులు తిరగబడటం వంటి సీన్లు గుండెని బరువెక్కిస్తాయి, గూస్ బంమ్స్ తెప్పిస్తాయి. థియేటర్‌లో విజిల్స్ వేసేలా ఉంటాయి.
అంతేకాదు కులంపై వచ్చే `అవసరానికి కులం ఉండదు`, `అవసరం ఉన్న చోట కులం ఉండదు`, `విద్య అనేది గుడిలో పెట్టే నైవేద్యం లాంటిది, దాన్ని పంచి పెట్టండి, అమ్మకండి`, అలాగే గురువుపై వచ్చే డైలాగులు ఆకట్టుకునేలా ఉంటాయి. వీటికి థియేటర్లలో విజిల్స్ కూడా పడతాయి. ఈ సినిమాలో ప్రధానంగా ఓ వైపు ప్రైవేట్ కాలేజీల మోసాలను, అప్పుడు గ్రామాల్లో ఉండే కుల వివక్షణని చర్చించారు. అవి ఏదో క్లాసులు పీకినట్టుగా కాకుండా, కాస్త ఎంటర్‌టైనింగ్‌గా, కాస్త ఆలోచింప చేసేలా చెప్పడం సినిమాలో హైలైట్ పాయింట్స్. ఎలాంటి అసభ్యతకు తావులేకుండా నీట్‌గా సాగడం ఫ్యామిలీ ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అయ్యే అంశం. అయితే సినిమా కొంత స్లోగా ఉండటం, అంతా ఊహించినట్టే జరగడం మైనస్. నెక్ట్స్ సీన్ ఏం జరుగుతుందో ఆడియెన్స్ ప్రెడిక్ట్ చేసేలా ఉండటమే ఇందులో మెయిన్ డ్రా బ్యాక్. మరోవైపు ఎమోషనల్ సన్నివేశాలు అంతగా పండలేదు. సినిమా మొదటి భాగం `రఘువరన్ బీటెక్` లాగా సాగుతుంది, క్లైమాక్స్ `3ఇడియట్స్`ని తలపిస్తుంది. లెక్చరర్ జర్నీ హిందీలో వచ్చిన `సూపర్ 30`ని తలపిస్తుంది. దీంతో డైరెక్టర్ ఒరిజినాలిటి మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. దీంతోపాటు తమిళ ఛాయలు కనిపించడం కూడా కొంత మైనస్‌గా చెప్పొచ్చు. ఇది 1990 జనరేషన్‌కి బాగా కనెక్ట్ అవుతుంది. కానీ ఈ జనరేషన్ ఆడియెన్స్ కి ఏ మేరకు కనెక్ట్ అవుతుందనేది ప్రశ్న. దీంతో ఇది రెగ్యూలర్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీగా నిలుస్తుంది. ధనుష్ ఫ్యాన్స్ మాత్రం ఎంజాయ్ చేస్తారు.
నటీనటులుః
బాలు(బాలగంగాధర్ తిలక్) పాత్రలో అదరగొట్టాడు. లెక్చరరే అయినా కొంత మాస్, ఇంకొంత క్లాస్ లుక్‌లో మెప్పించాడు. టూమచ్ హీరోయిజానికి పోకుండా ఆయన పాత్ర ఎంత హై ఉండాలో, ఎంత లో ఉండాలో అలా పర్‌ఫెక్ట్ మీటర్‌లో ఉంటుంది. ఎమోషనల్ సీన్స్ లో వాహ్ అనిపించాడు. సినిమాని తన భుజాలపై మోశాను, తనదైన యాక్టింగ్‌లో మెప్పించాడు. ఈ సినిమాతో తెలుగు ఆడియెన్స్ కి మరింత దగ్గరవుతారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. బయాలజీ లెక్చరర్‌గా సంయుక్త పాత్ర నిడివి మేరకు బాగా చేసింది. ట్రెడిషనల్ లుక్‌లో ఆకట్టుకుంది. హైపర్ ఆది పాత్ర ఫస్టాఫ్‌తోనే ముగుస్తుంది. ఆయన పాత్ర నుంచి కామెడీని ఆశించిన స్థాయిలో లేకపోవడం కాస్త డిజప్పాయింట్ చేసే అంశం. త్రిపాఠిగా నెగటివ్ రోల్‌కి సముద్రఖని కొట్టిన పిండే, బాగా చేశాడు. తనికెళ్ల భరణి పాత్ర ఫర్వాలేదు, పబ్లిసిటీ పిచ్చి ఉన్న ఊరి ప్రెసిడెంట్‌గా సాయికుమార్ పాత్ర బాగా మెప్పిస్తుంది. కలెక్టర్ మూర్తిగా కథ చెప్పే పాత్రలో సుమంత్ కాసేపు మెప్పించాడు. మిగిలిన పాత్రలు నిడివి మేరకు ఓకే అనిపిస్తాయి.
టెక్నీషియన్ల పనితీరుః
`తొలిప్రేమ`తో మంచి హిట్ సినిమాని అందించిన దర్శకుడు వెంకీ అట్లూరి ఆ తర్వాత `మిస్టర్ మజ్ను`, `రంగ్ దే` చిత్రాలతో మెప్పించలేకపోయాడు. అయితే ఈ సారి ఆయన ఓ సందేశాత్మక చిత్రంతో రావడం విశేషం. సినిమా కొంత ఎంటర్‌టైనింగ్‌గా సాగినా, ఆయన మార్కు ఒరిజినాలిటీ మిస్ అయ్యింది. సినిమాని చూస్తుంటే ఇతర చిత్రాలు గుర్తుకు రావడం మైనస్. డైలాగ్‌లు మాత్రం హైలైట్‌గా నిలుస్తాయి. స్క్రీన్ ప్లే నీట్‌గానే సాగుతుంది. కొత్తగా చెప్పలేకపోవడంతో ఇది మంచి సందేశాత్మక చిత్రమైనా, రెగ్యూలర్ మూవీ అనే ఫీలింగ్‌ని తెప్పిస్తుంది. ఇక జే యువరాజ్ సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ ప్లజెంట్‌గా ఉన్నాయి. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి బ్యాక్ బోన్‌గా నిలుస్తాయి. మాస్టారు మాస్లారు.. పాట చాలా బాగుంది. ఎడిటింగ్ ఓకే. సితార ఎంటర్‌టైన్‌మెంట్, త్రివిక్రమ్‌కి చెందిన ఫార్చ్యూన్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థల నిర్మాణ విలువలకు పేరు పెట్టే అవసరం లేదు. రిచ్‌గా తీశారు.
ఫైనల్‌గాః సందేశం ఉన్న క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. దర్శకుడు కష్టపడితే సినిమా ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యేది.
రేటింగ్‌ః 2.75
నటీనటులు : ధనుష్, సంయుక్తా మీనన్, సముద్రఖని, సాయి కుమార్, సుమంత్, తనికెళ్ళ భరణి, 'హైపర్' ఆది, 'ఆడుకాలమ్' నరేన్, మొట్ట రాజేందర్, హరీష్ పేరడీ, పమ్మి సాయి తదితరులు.
ఛాయాగ్రహణం : జె. యువరాజ్
సంగీతం : జీవీ ప్రకాష్ కుమార్
రచన, దర్శకత్వం : వెంకీ అట్లూరి
బ్యానర్స్ ః సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ .
నిర్మాతలు : సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
విడుదల తేదీ: ఫిబ్రవరి 16, 2023