
ప్రముఖ గాయని మంగ్లీ బర్త్‌డే పార్టీలో మాదక ద్రవ్యాల వినియోగం తీవ్ర వివాదం గా మారింది. మంగ్లీ బర్త్ డే పార్టీకి హాజరైన సెలెబ్రిటీల పేర్లు కొన్ని మీడియాలో వైరల్ గా మారాయి. కొందరు సెలెబ్రిటీలు మంగ్లీ బర్త్ డే పార్టీలో గంజాయి, మాదక ద్రవ్యాలు వాడినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ వివాదంతో మంగ్లీ తొలిసారి స్పందిస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. తన బర్త్ డే పార్టీ వివాదంపై సోషల్ మీడియాలో వివరణ ఇస్తూ వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో మంగ్లీ మాట్లాడుతూ.. జూన్ 10న నానా పుట్టిన రోజు వేడుకల్ని ఫ్యామిలీ ఫంక్షన్ లాగా జరుపుకోవాలని మా అమ్మా నాన్న కోరారు. వారి కోరిక మేరకు ఆ రిసార్ట్ లో ఫ్యామిలీ ఫంక్షన్ లాగా నా బర్త్ డే సెలెబ్రేషన్స్ జరిగాయి.
ఆ పార్టీలో మా కుటుంబ సభ్యులు, నా టీం మెంబర్స్, నా ఫ్రెండ్స్ కొంతమంది మాత్రమే పాల్గొన్నారు. ఫంక్షన్ కాబట్టి మద్యం,సౌండ్ సిస్టమ్ (డీజే) అక్కడ ఉన్నాయి. వాటికి అనుమతి తీసుకోవాలనే అవగాహన నాకు ఏమాత్రం లేదు. సడెన్ గా ఫంక్షన్ ప్లాన్ చేసుకోవడం వల్ల అనుమతి తీసుకోవాలని ఎవరూ గైడ్ చేయలేదు. నేను తెలిసి ఏ తప్పూ చేయలేదు. తెలియకుండా అలా జరిగింది. లోకల్ లిక్కర్ తప్ప ఇంకేమి వాడలేదు. మాదక ద్రవ్యాలు అసలే వాడలేదు. అక్కడ పోలీసులకు మాదక ద్రవ్యాలు దొరకలేదు కూడా.
కానీ ఒకరికి మాదకద్రవ్యాలు పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. ఆయన కొన్ని రోజుల క్రితం ఎక్కడో మాదక ద్రవ్యాలు వాడడం వల్ల ఇప్పుడు పాజిటివ్ వచ్చింది అని పోలీసులే చెబుతున్నారు అంటూ మంగ్లీ పేర్కొంది. మేము కూడా పోలీసులకు విచారణలో సహకరిస్తున్నాం. మా అమ్మా నాన్నలు ఉండగా నేను తప్పు ఎలా చేస్తాను ? దయచేసి లేనిపోని అభియోగాలు నా మీద వేయొద్దు అంటూ మంగ్లీ ఎమోషనల్ గా పేర్కొన్నారు.
మంగ్లీ బర్త్ డే పార్టీలో బిగ్ బాస్ దివి పాల్గొన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై దివి స్పందించింది. తాను మంగ్లీ బర్త్ డే పార్టీలో పాల్గొన్న సంగతి నిజమే అని.. కానీ అక్కడ జరిగిన తప్పులకు తనకు సంబంధం లేదని పేర్కొంది. రచ్చ రవి పేరు కూడా తెరపైకి రావడంతో అతడు స్పందించాడు. తనపై వస్తున్న పుకార్లని ఖండిస్తూ అధికారికంగా ప్రకటన విడుదల చేశాడు.
ఈ ప్రకటనలో రచ్చ రవి మాట్లాడుతూ – “మంగ్లీ బర్త్‌డే వేడుకలతో సంబంధించి ప్రస్తుతం మీడియాలో వెలువడుతున్న వార్తల విషయమై నేను ఈ లేఖ రాస్తున్నాను. మంగ్లీ బర్త్ డే పార్టీతో నాకు సంబంధం లేకపోయినప్పటికీ, కొన్ని మీడియా సంస్థలు నా పేరును ప్రస్తావిస్తూ వార్తలు ప్రచారం చేస్తున్నారు. మంగ్లీ బర్త్ డే పార్టీలో నేను లేను ఈ సందర్భంగా నేను స్పష్టంగా తెలియజేయాలనుకుంటున్నాను – మంగ్లీ బర్త్‌డే పార్టీలో నేను పాల్గొనలేదు. ఏవిధంగా కూడా ఆ వేడుకలో నేను భాగస్వామిని కాలేదు. గత కొన్ని రోజులుగా నేను నా షూటింగ్ షెడ్యూల్‌లో పూర్తిగా బిజీగా ఉన్నాను. ఇంతవరకు నా కుటుంబాన్ని కూడా కలిసే సమయం దొరకలేదు,” అని ఆయన వివరించారు.
వివరాలు నిర్ధారించుకోకుండా ఈ తరహా కథనాల్లో నా పేరు చేర్చడం నన్నెంతో ఆశ్చర్యానికి గురి చేసింది. మీడియా రంగంలో ఉన్న ప్రతి ఒక్కరినీ గౌరవిస్తూ, మీ అందరి సహకారం కోరుతున్నాను. ఒకసారి నిజాలు పూర్తిగా తెలుసుకుని, ఆ తర్వాతే నివేదికలు ప్రచురించమని అభ్యర్థిస్తున్నాను, అని రచ్చ రవి తన లేఖలో పేర్కొన్నారు.