
‘బాహుబలి’ సినిమా సాధించిన భారీ విజయంతో భారీ ఫిక్షన్ ఎపిక్స్ చేయాలనే పట్టుదల చాలా మంది దర్శకుల్లో పెరిగింది. అదే పట్టుదలతో తమిళంతోపాటు పలు దేశీయ భాషల్లో ‘సంఘమిత్ర’ చిత్రాన్ని మొదలుపెట్టిన దర్శకుడు సుందర్ కు ప్రాక్టికల్ ప్రాబ్లెమ్స్ ఏంటో ఒక్కొక్కటిగా తెలిసొస్తున్నాయి. ఈ చిత్రానికి హీరోలుగా చేయమంటూ చాలా మంది స్టార్లను సంప్రదించాడు సుందర్. కానీ విజయ్, సూర్య, మహేష్ బాబు.. ఇలా చాలామంది ఆయనకు నో చెప్పేశారు. చివరికి జయం రవి, ఆర్య లాంటి మీడియం రేంజి హీరోలతో సర్దుకుపోతున్నాడు.
ఇక కథానాయికగా శ్రుతి హాసన్ లాంటి ఆల్ ఇండియా ఫేమ్ ఉన్న అమ్మాయి సెట్టయిందిలే అనుకుంటే.. ఆమె ఈ ప్రాజెక్టు నుంచి అనూహ్యంగా తప్పుకుంది. స్క్రిప్ట్ పక్కాగా లేకపోవడం, డేట్ క్యాలెండర్ పక్కాగా లేకపోవడం వల్లే తాను ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లుగా శ్రుతి పేర్కొంది. దీనిపై ‘సంఘమిత్ర’ యూనిట్ నుంచి మొన్నటిదాకా సరైన క్లారిఫికేషన్ లేదు. కానీ ఇప్పుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ‘తెండ్రాల్ ఫిలిమ్స్’ సంస్థ ప్రతినిధి హేమా రుక్మిణి శ్రుతి తప్పుకోవడంపై మరో వెర్షన్ చెప్పారు.
శ్రుతి ఈ సినిమా నుంచి తనంతట తాను తప్పుకోలేదని.. ఆమెతో కొన్ని ఇబ్బందులుండటంతో తామే ఆమెను తప్పించామని రుక్మిణి ప్రకటించింది. శ్రుతి స్థానంలో ఎవరిని హీరోయిన్‌గా ఎంచుకుంటామనే విషయంలో రకరకాల వార్తలు వస్తున్నాయని.. నయనతార అయితే బాగుంటుందని అంటున్నారని.. నిజంగా ఆమె గొప్ప నటి అని.. త్వరలోనే సంఘమిత్రలో కథానాయిక ఎవరనే విషయం ప్రకటిస్తామని రుక్మిణి తెలిపారు. ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లేందుకు ఇంకొంత సమయం పడుతుందని.. ఆలోపు కథానాయికను ఫైనలైజ్ చేస్తామని ఆమె అన్నారు.