
నటుడు మోహన్ బాబు కుమారులు విష్ణు-మనోజ్ మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. విష్ణు మీద ఆరోపణలు చేస్తూ మనోజ్ ఏకంగా వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో నా మనుషుల మీద విష్ణు దాడి చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. నాలుగు గోడల మధ్య జరుగుతున్న గొడవలు మనోజ్ చర్యతో అందరికీ తెలిశాయి. ప్రచారం అవుతున్న పుకార్లకు పూర్తి క్లారిటీ వచ్చింది. అసలు మంచు బ్రదర్స్ మధ్య గొడవలకు కారణాలు ఏమిటనే విశ్లేషణ మొదలైంది.
మోహన్ బాబు కుటుంబానికి సన్నిహితుడైన నిర్మాత చిట్టిబాబు మనోజ్-విష్ణుల గొడవను ఉద్దేశిస్తూ మాట్లాడారు. తనకు తెలిసిన విషయాలు బయటపెట్టారు. సారధి అనే వ్యక్తి ఈ గొడవలో కీలక పాత్ర పోషించారు. సారధి మోహన్ బాబు వద్ద చాలా కాలంగా పని చేస్తున్నాడు. మోహన్ బాబు పనులన్నీ దగ్గరుండి సారధే చక్కబెడతారు. ఆ కుటుంబానికి అత్యంత నమ్మకస్తుడు.
మోహన్ బాబు తన ఇద్దరు కొడుకులకు ఆస్తులు పంచేశారు. శ్రీవిద్యా నికేతన్ బాధ్యతలు మంచు విష్ణుకు అప్పగించారు. అయితే చిన్న విషయంలో విష్ణుకు సారధి స్పష్టత ఇవ్వాల్సి ఉంది. కానీ అతడు తప్పించుకు తిరుగుతున్నాడు. దాంతో సారధి ఇంటికి వెళ్లి విష్ణు గొడవపడ్డాడు. విష్ణును తన అసిస్టెంట్ గజేంద్ర తో పాటు మరికొందరు ఆపారు. సారధి ఇంటికి వెళ్లకుండా విష్ణు తండ్రి మోహన్ బాబుకు ఫోన్ చేసి విషయం చెబితే ఆయన చూసుకునేవారు.
సారధి ఇంటికి వెళ్లి గొడవపడటం విష్ణు తప్పు. దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి మనోజ్ ఇంకా పెద్ద తప్పు చేశారు. మోహన్ బాబు విషయం ఏదైనా నాలుగు గోడల మధ్యే సాల్వ్ చేసుకుంటారు. కుటుంబ పరువు పోకుండా జాగ్రత్త పడతారు. అనుకోకుండా మనోజ్-విష్ణు గొడవలు తెరపైకి వచ్చాయని చిట్టిబాబు చెప్పుకొచ్చారు.