
తెలుగువారికి సాగర కన్యగా శిల్పా శెట్టి పరిచయం. వెంకటేష్ సాహసవీరుడు సాగర కన్య చిత్రంలో శిల్పా శెట్టి నటించింది. బాలీవుడ్ లో శిల్పా శెట్టి దశాబ్దాలుగా క్రేజీ స్టార్ గా రాణిస్తోంది. గ్లామర్ పరంగా శిల్పా శెట్టి యువతపై చూపిన ప్రభావం అంతా ఇంతా కాదు. ఆమె యోగా చేసినా సరే ఆ దృశ్యాలు ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారేవి.
తాజాగా శిల్పా శెట్టి తన ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఆమె ప్రస్తుతం రోహిత్ శెట్టి దర్శకత్వంలో ఇండియన్ పోలీస్ ఫోర్స్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ లో శిల్పా శెట్టి తీవ్రంగా గాయపడడంతో ఆమె కాలు ఫ్రాక్చర్ అయింది. దీనితో వైద్యులు సర్జరీ చేసి ఆరు వారాలు విశ్రాంతి సూచించారు.
ఈ విషయాన్ని శిల్పా శెట్టి స్వయంగా సోషల్ మీడియాలో పేర్కొంది. ఆరు వారాల పాటు నేను యాక్షన్ కి దూరం. అభిమానులంతా నేను త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి అని కోరింది. ప్రార్థనలకు తప్పకుండా ఫలితం ఉంటుందని పేర్కొంది. చికిత్స తర్వాత ఫ్రాక్చర్ అయిన కాలుతో శిల్పా శెట్టి చిరునవ్వులు చిందిస్తూ వీల్ చైర్ పై కూర్చుని ఉంది.
ఇటీవల శిల్పా శెట్టి ఇండియన్ పోలీస్ ఫోర్స్ వెబ్ సిరీస్ లో యాక్షన్ సీన్స్ లో నటిస్తున్న వీడియో షేర్ చేసింది. ఈ వీడియో చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది. 47 ఏళ్ల వయసులో శిల్పా శెట్టి తిరుగులేని ఎనెర్జీతో విలన్స్ పై విరుచుకుపడుతోంది. ఆ రేంజ్ లో యాక్షన్ సీన్స్ చేస్తే ఇలాంటి గాయాలు సహజమే అని ఫ్యాన్స్ అంటున్నారు. శిల్పా శెట్టి త్వరగా కోలుకోవాలని విష్ చేస్తున్నారు.
శిల్పా శెట్టి తో పాటు సిద్దార్థ్ మల్హోత్రా, వివేక్ ఒబెరాయ్, ఇషా తల్వార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ లో ఈ సిరీస్ రిలీజ్ కానుంది.